Share News

Shashi Tharoor: తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరనే ప్రశ్నకు శశిథరూర్ ఏం చెప్పారంటే

ABN , Publish Date - Aug 03 , 2025 | 04:42 PM

పహల్గాం ఉగ్రదాడిని ప్రపంచ దేశాల్లో ఎండగట్టేందుకు అఖిల పక్ష ప్రతినిధి బృందాన్ని పంపాలని మోదీ ప్రభుత్వం అనుకున్నప్పుడు శశిథరూర్‌ను కేంద్రం ఎంపిక చేసింది. పార్టీని సంప్రదించకుండా శశిథరూర్‌ను ఎంపిక చేయడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

Shashi Tharoor: తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరనే ప్రశ్నకు శశిథరూర్ ఏం చెప్పారంటే
Shashi Tharoor

న్యూఢిల్లీ: జగదీప్ ధన్‌ఖడ్ ఇటీవల రాజీనామా చేయడంతో ఉప రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఇటీవల విడుదలైంది. దీంతో తదుపరి ఉప రాష్ట్రపతి ఎవరవుతున్నారనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పలువురి పేర్లు సైతం వినపడుతున్నాయి. సంఖ్యాపరంగా బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే నామినేటెడ్ అభ్యర్థికే విజయావకాశాలు బలంగా ఉన్నాయని, అయితే ఈ ప్రక్రియలో విపక్షాలను అధికార పార్టీ సంప్రదించే అవకాశాలు ఉండొచ్చని వినిపిస్తోంది.


దీనిపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను మీడియా ఆదివారం నాడు ప్రశ్నించినప్పుడు ఫలితం అందరికీ తెలిసినదేనని, అధికార బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేకే అనుకూలంగానే ఫలితం రావచ్చని ఆయన సమాధానమిచ్చారు. 'అధికార పార్టీ నామినేట్ చేసిన వ్యక్తికే ఉప రాష్ట్రపతి పదవి దక్కుతుందని అందరికీ తెలిసిన విషయమే. సభ్యుల లెక్కలు మనకు తెలిసినవే' అని అన్నారు. విపక్షాలను సంప్రదించే అవకాశాలపై అడిగినప్పుడు, అదెవరు చెప్పగలరు? సంప్రదిస్తారనే ఆశిస్తున్నామని చెప్పారు.


శశిథరూర్ కాంగ్రెస్ పార్టీకి దూరమవుతూ బీజేపీకి దగ్గరవుతున్నారనే ప్రచారం కొద్దికాలంగా జరుగుతోంది. అందుకు బలం చేకూర్చే ఆసక్తికర పరిణామాలూ చోటుచేసుకున్నాయి. పహల్గాం ఉగ్రదాడిని ప్రపంచ దేశాల్లో ఎండగట్టేందుకు అఖిల పక్ష ప్రతినిధి బృందాన్ని పంపాలని మోదీ ప్రభుత్వం అనుకున్నప్పుడు శశిథరూర్‌ను కేంద్రం ఎంపిక చేసింది. పార్టీని సంప్రదించకుండా శశిథరూర్‌ను ఎంపిక చేయడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. శశిథరూర్ సైతం యూఎస్, ఇతర దేశాల్లో పర్యటన సందర్భంగా మోదీ సమర్ధతను ప్రశంసించారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గ్లోబల్ డిప్లొమేట్‌గా, కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు శశిథరూర్. అయితే, గత వారంలో ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంటులో చర్చ జరిగినప్పుడు కాంగ్రెస్ తరఫు వక్తగా శశిథరూర్‌ను పార్టీ దూరంగా ఉంచింది.


కాగా, ఉపరాష్ట్రపతి ఎన్నిక రాష్ట్రపతి ఎన్నికలా ఉండదని, రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియలో రాష్ట్ర అసెంబ్లీలు కూడా పాల్గొంటాయని, ఉపరాష్ట్రపతిని మాత్రం కేవలం పార్లమెంటు సభ్యులే ఎన్నుకుంటారని శశిథరూర్ వివరించారు. సంఖ్యాపరంగా ఎన్డీయేకు గెలుపు అంచులోనే ఉందని, అయినప్పటికీ ఈ ప్రక్రియలో భాగంగా విపక్షాలను సంప్రదించే అవకాశాలు ఉండొచ్చని తాను ఆశిస్తున్నానని చెప్పారు.


సెప్టెంబర్ 9న ఎన్నిక

ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న జరుగనుంది. కాంగ్రెస్ సారథ్యంలోని విపక్షం ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపే అవకాశం ఉంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే సైతం ఉమ్మడి అభ్యర్థిని పోటీకి దింపనుంది. ఎన్నిక అనివార్యమైతే సెప్టెంబర్ 9వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొంటారు. రాజ్యసభ నామినేడెడ్ సభ్యులకు సైతం ఓటు వేసే అర్హత ఉంటుంది. ఆ ప్రకారం రాజ్యసభకు ఎన్నికైన 233 మంది, 12 మంది నామినేటెడ్ సభ్యులు, లోక్‌సభలోని 543 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొంటారు.


ఇవి కూడా చదవండి..

వరదల తాకిడికి వారణాసి-ప్రయాగ్‌రాజ్ అతలాకుతలం.. అఖిలేష్ యాదవ్ ఆగ్రహం

కాలువలోకి దూసుకెళ్లిన వాహనం.. బలైపోయిన 11 మంది, డ్రైవర్ సేఫ్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 03 , 2025 | 08:33 PM