Share News

UK F-35B: బ్రిటన్ ఎఫ్-35బీ ఫైటర్ జెట్ ఎట్టకేలకు తిరుగు ప్రయాణం

ABN , Publish Date - Jul 22 , 2025 | 12:50 PM

సాంకేతిక సమస్యల కారణంగా నెలరోజులకు పైగా కేరళలో నిలిచిపోయిన బ్రిటన్ ఫైటర్ జెట్ ఎట్టకేలకు తిరుగు ప్రయాణమైంది. ఈ విషయాన్ని బ్రిటన్ హైకమిషన్ ప్రతినిధి వెల్లడించారు. ఈ విషయంలో సహకరించిన భారత్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

UK F-35B: బ్రిటన్ ఎఫ్-35బీ ఫైటర్ జెట్ ఎట్టకేలకు తిరుగు ప్రయాణం
UK F-35 jet Kerala

ఇంటర్నెట్ డెస్క్: సాంకేతిక సమస్యలతో నెల రోజులకు పైగా తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో నిలిచిపోయిన బ్రిటన్ ఎఫ్-35బీ యుద్ధ విమానం ఎట్టకేలకు తిరుగుప్రయాణమైంది. యూకే ఇంజినీరింగ్ నిపుణులు సాంకేతిక లోపాలన్నిటినీ సరిదిద్దినట్టు బ్రిటన్ హైకమిషన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ సందర్భంగా భారత్ అందించిన సహాయ సహకారాలకు ధన్యవాదాలు తెలిపారు. ఎయిర్‌పోర్టు టిమ్స్‌కు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇరు దేశాల మధ్య రక్షణ రంగ భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

బ్రిటన్‌కు చెందిన ఈ ఎఫ్-35బీ ఐదవ తరానికి చెందిన అత్యాధునిక ఫైటర్ జెట్. ఓ మిషన్‌లో పాలుపంచుకుంటున్న సమయంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా గత నెల 14న ఫైటర్ జెట్ తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దిగిపోవాల్సి వచ్చింది ఈ క్రమంలో ల్యాండింగ్ గేర్, బ్రేకులు, కంట్రోల్ సర్ఫేసెస్‌లో లోపాలు బయటపడ్డాయి. వీటిని రిపేర్ చేసేందుకు మొదట చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.


ఇక ఎయిర్‌పోర్టులో దిగింది మొదలు చాలా రోజుల పాటు ఫైటర్ జెట్‌ను ఆరుబయట టార్మాక్‌పైనే నిలిపారు. ఫలితంగా ఎయిర్‌పోర్టులోని వారికి ఈ ఫైటర్ జెట్ ప్రధాన ఆకర్షణగా మారింది. ఈ విషయంపై కేరళ టూరిజం డిపార్ట్‌మెంట్‌ కూడా నెట్టింట జోకులు పేల్చింది.

మరోవైపు, జులై 6ను బ్రిటన్‌ నుంచి ప్రత్యేక ఇంజినీరింగ్ నిపుణుల బృందం వచ్చి మరమ్మతులను కొనసాగించింది. ఓ దశలో విమానాన్ని భాగాలుగా విడగొట్టి మిలిటరీ కార్గో ప్లేన్‌లో తరలించాల్సి రావొచ్చన్న భయాలు నెలకొన్నాయి. అయితే, ఇంజినీరింగ్ బృందం ప్రయత్నాలు విజయవంతమయ్యాయి. ఆ తరువాత పలు రకాల తనిఖీలు నిర్వహించి అంతా సరి చూశాక తిరుగుప్రయాణానికి ఇంజినీరింగ్ టీమ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విమానం బ్రిటన్‌‌కు బయలుదేరింది.

ఈ యుద్ధ విమానాన్ని అమెరికా రక్షణ రంగ సంస్థ లాక్‌హీడ్ మార్టిన్ రూపొందించింది. ప్రపంచంలోనే అత్యంత అత్యాధుని విమానంగా పేరుపొందిన ఈ ఫైటర్ జెట్ ఖరీదు ఏకంగా 115 మిలియన్ డాలర్లు. తక్కువ నిడివి ఉన్న రన్‌వేల నుంచి టేకాఫ్ చేయడంతో పాటు అవసరమైతే హెలికాఫ్టర్‌లగా నిట్టనిలువుగా గాల్లోకి లేచి టేకాఫ్ చేసే సామర్థ్యం కూడా ఈ విమానానికి ఉంది.


ఇవి కూడా చదవండి:

సైబర్ దాడి.. 158 ఏళ్ల నాటి ట్రాన్స్‌పోర్టు కంపెనీ మూసివేత.. 700 ఉద్యోగులకు లేఆఫ్

ప్రముఖ అమెరికన్ టీవీ షోకు ముగింపు.. తెగ మురిసిపోయిన డొనాల్డ్ ట్రంప్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 22 , 2025 | 01:03 PM