TMC MLA Comments: బెంగాల్‌లో కొత్త బాబ్రీ మసీద్‌కు పునాది వేస్తాము.. తృణమూల్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన
ABN , Publish Date - Nov 23 , 2025 | 10:39 PM
బెంగాల్‌లో బాబ్రీ మసీదు నిర్మాణం చేపడతామంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ చేసిన ప్రకటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. సీఎం మమతా బెనర్జీ అభీష్టం మేరకే ఈ ప్రకటన వెలువడిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన జరిగిన డిసెంబర్ 6న బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో బాబ్రీ మసీదుకు పునాది వేస్తామని తెలిపారు. ఓ కార్యక్రమం కూడా నిర్వహిస్తామని, పలువురు ముస్లిం నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. ‘డిసెంబర్ 6న బెల్దంగాలో బాబ్రీ మసీదుకు పునాది వేస్తాము. నిర్మాణం పూర్తయ్యేందుకు మూడేళ్లు పడుతుంది’ అని చెప్పారు.
ఈ కామెంట్స్‌పై బీజేపీ తీవ్రంగా స్పందించింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార పార్టీ మతాన్ని ఆయుధంగా వాడుకుంటోందని మండిపడింది. క్రిమినల్ పాలిటిక్స్‌కు ఇది పరాకాష్ఠ అని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా అన్నారు. సీఎం మమతా బెనర్జీ అభీష్టం మేరకే ఈ ప్రకటన వెలువడిందని కామెంట్ చేశారు. సీఎం ఆలోచనా ధోరణి, భావజాలం గర్హనీయమని కామెంట్ చేశారు. అక్రమ వలసదారులవైపు ఆమె మొగ్గుచూపుతున్నారనే విషయానికి ఈ పరిణామాలు అద్దం పడుతున్నాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఓటమి తప్పదని సీఎం మమతా బెనర్జీకి తప్పదని అన్నారు.
బెంగాల్‌లో శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు ఈ పరిణామాలను ఆధారాలుగా చూడాలని కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ బెంగాలీ హిందువులకు సూచించారు. బెదిరింపు రాజకీయాలకు తెర లేచిందని వ్యాఖ్యానించారు. విదేశీ పాలకుడి పేరిట ఒక్క ఇటుకను కూడా పునాదిగా పేర్చలేరని యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు. డిసెంబర్ 6న కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు తృణమూల్ కాంగ్రెస్ సిద్ధమవుతున్న నేపథ్యంలో కబీర్ ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది. సాధారణంగా ఈ ర్యాలీని పార్టీకి చెందిన మైనారిటీ వింగ్ నిర్వహిస్తుంది. కానీ ఈసారి బాధ్యతలను విద్యార్థి, యువత విభాగానికి అప్పగించారు. బాబ్రీ మసీదూ కూల్చివేతకు నిరసనగా ఏటా నిర్వహించే ఈ ర్యాలీలో ఈసారి సీఎం మమతా బెనర్జీ కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి...
ఆహార ఉత్పత్తులపై ఓఆర్ఎస్ లేబుల్స్‌ను వెంటనే తొలగించాలి.. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలు
పంజాబ్‌లో ఎన్‌కౌంటర్.. పోలీసుల అదుపులో ఇద్దరు ఉగ్రవాదులు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి