Kafi Success Story: యాసిడ్ దాడిలో కళ్లు పోయాయి.. అయినా విజయం సాధించింది..
ABN , Publish Date - May 15 , 2025 | 11:14 AM
Kafi Success Story: కఫి తండ్రి పవన్ హర్యానా సెక్రటేరియట్లో ప్యూన్‌గా పని చేస్తున్నాడు. తల్లి గృహిణి. వారిద్దరూ ఐదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. తమకు చదువు లేదు కాబట్టి.. కూతుర్ని చదివించాలని అనుకున్నారు.

అనుకున్నది సాధించాలనే తపన.. నిద్రపోనివ్వని కసి(కండీషన్స్ అప్లై) ఈ రెండు ఉంటే చాలు మనిషి ఉన్నత శిఖరాలను చేరతాడు. కొంతమంది అన్నీ ఉన్నా.. కష్టపడ్డానికి, అనుకున్నది సాధించడానికి బద్దకిస్తూ ఉంటారు. తమ దగ్గర లేని వాటి గురించే అతిగా ఆలోచిస్తుంటారు. చివరకు ఫెయిల్ అవుతూ ఉంటారు. నూటికో.. కోటికో ఒక్కరు అన్నట్లు తమ దగ్గర లేని వాటి గురించి కాకుండా .. ఉన్న వాటితో అద్భుతాలు సృష్టిస్తూ ఉంటారు. చరిత్ర తిరగరాస్తూ ఉంటారు. ఇందుకు కఫి విజయగాథే ఓ ప్రత్యక్ష ఉదాహరణ.
కళ్లు లేని ఆ యువతి ఇంటర్ పరీక్షల్లో 95 శాతం ఫలితాలు సాధించింది. తన విజయంతో ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తోంది. కఫి సక్సెస్ స్టోరీ విషయానికి వస్తే.. చండీఘర్‌కు చెందిన కఫి మూడేళ్ల ప్రాయంలోనే కళ్లు పోగొట్టుకుంది. కుటుంబ గొడవల నేపథ్యంలో ఆమెపై యాసిడ్ దాడి జరిగింది. ముఖంపై పడ్డ యాసిడ్ కళ్లను పాడుచేసింది. ముఖం కూడా బాగా కాలిపోయింది. పదుల సంఖ్యలో సర్జరీల తర్వాత ఆమె పరిస్థితి కొంత మెరుగుపడింది. కళ్లు మాత్రం రాలేదు. కళ్లు లేకపోయినా ఆమె ఏమాత్రం కృంగిపోలేదు. ఏదైనా సాధించి చూపాలని అనుకుంటూ ఉండేది.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కళ్లు లేకపోయినా.. చదువు కొనసాగించింది. కఫి తండ్రి పవన్ హర్యానా సెక్రటేరియట్లో ప్యూన్‌గా పని చేస్తున్నాడు. తల్లి గృహిణి. వారిద్దరూ ఐదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. తమకు చదువు లేదు కాబట్టి.. కూతుర్ని చదివించాలని అనుకున్నారు. ఉన్నత స్థితిలోకి తీసుకురావాలని భావించారు. తల్లిదండ్రుల ఆశలకు తగ్గట్టే పదవ తరగతిలో కఫి మంచి మార్కులతో పాసైంది. 95.2 శాతం మార్కులు సాధించింది. తర్వాత చండీఘర్‌లోని అంధుల కాలేజీలో ఇంటర్లో చేరింది.
ఇంటర్లో కూడా ఏ మాత్రం తగ్గలేదు. 95.6 శాతం మార్కులు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంధుల కాలేజీలో టాప్ ర్యాంకు తెచ్చుకుంది. కఫి తర్వాత స్థానంలో 94 శాతం మార్కులతో సుమన్ పొద్దర్, 93.6 శాతం మార్కులతో గుర్శరన్ సింగ్ మూడవ స్థానంలో నిలిచాడు. సాధారణ వ్యక్తులు చదివి ర్యాంకులు కొట్టడానికి .. అంధులు చదివి ర్యాంకులు సాధించడానికి తేడా ఉంటుంది. చదువుకోవడానికి అవసరమైన మెటీరియల్స్ వీరికి దొరకవు. అంధ విద్యార్థులు యూట్యూబ్ మీద ఆధారపడి చదువుకుంటూ ఉంటారు. కఫి తన విజయంపై మాట్లాడుతూ... ‘ మా యుద్ధం ఇప్పుడే మొదలైంది. నా కేసు నేను వాదించుకోవాలన్న ఉద్దేశ్యంతో ఎంతో కష్టపడి చదువుకుంటున్నాను. న్యాయం జరిగేలా చేసుకుంటాను’ అని అంది.
ఇవి కూడా చదవండి
Astrologer: శరీరంలో 15 ఆత్మలు ఉన్నాయంటే.. నువ్వెలా నమ్మావు తల్లి..
Heavy Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం..