Share News

Delhi Car Bomb Blast: ఆత్మాహుతి దాడా? అనూహ్య పేలుడా?

ABN , Publish Date - Nov 12 , 2025 | 02:34 AM

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద సోమవారం సాయంత్రం జరిగిన కారుబాంబు పేలుడు ఆత్మాహుతి దాడా? కాదా? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి....

Delhi Car Bomb Blast: ఆత్మాహుతి దాడా? అనూహ్య పేలుడా?

  • ఢిల్లీ బాంబుదాడిపై భిన్నాభిప్రాయాలు.. దొరికిపోతానన్న భయంతో బాంబు పేల్చాడంటున్న పోలీసులు

  • ఉద్దేశపూర్వకంగానే పేల్చి ఉండొచ్చని మరికొందరి వాదన.. కేసు దర్యాప్తు ఎన్‌ఐఏకు అప్పగింత

  • హ ర్యానాలోని ఫరీదాబాద్‌ కేంద్రంగా ఉగ్ర కుట్ర.. అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీలో ముగ్గురు వైద్యుల అరెస్టు

  • 11 గంటలపాటు కారులోనే తిరిగిన ఉగ్రవాది.. పేలుడుకు వాడిన కారు దర్యాప్తులో కీలకం

న్యూఢిల్లీ, నవంబరు 11: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద సోమవారం సాయంత్రం జరిగిన కారుబాంబు పేలుడు ఆత్మాహుతి దాడా? కాదా? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ పోలీసులు, ప్రభుత్వ వ ర్గాలు ఇది ఆత్మాహుతి దాడి కాదని చెబుతుండగా, మరికొందరు మాత్రం ఉగ్రవాది ఆత్మాహుతి దాడికే పాల్పడ్డాడని పేర్కొంటున్నారు.ఈ ఉగ్రకుట్ర మొత్తం హర్యానాలోని ఫరీదాబాద్‌ కేంద్రంగానే జరిగినట్లు పోలీసులు తెలిపారు. కారున నడిపిన ఉమర్‌ నబీతోపాటు మరో ఇద్దరు అందులో ఉన్నట్లు మొదట వార్తలు వచ్చినప్పటికీ.. ఉమర్‌ నబీ ఒక్కడే కారులో వెళ్లాడని పోలీసులు మంగళవారం ప్రకటించారు. ఈ కేసు దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఎన్‌ఐఏకు అప్పగించింది. యూఏపీఏ చట్టం కింద మంగళవారం ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. బాంబుపేలుడులో సోమవారం ఘటనా స్థలంలోనే 9 మంది మరణించగా, మంగళవారం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో మరో ముగ్గురు మరణించటంతో మృతుల సంఖ్య 12కు చేరింది. మృతుల్లో ఏడుగురిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతుల కుటుంబాలకు ఢిల్లీ సీఎం రేఖాగుప్త మంగళవారం రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు.


అధికారుల గంటకో మాట..

కారు బాంబు పేలినప్పటి నుంచి దాడి తీరుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొదట సిలిండర్‌ పేలుడు అని భావించిన పోలీసులు.. తర్వాత ఉగ్ర దాడి అని ప్రకటించారు. మంగళవారం ఆత్మాహుతి దాడి అని మొదట అనధికారికంగా మీడియాకు తెలిపిన ఢిల్లీ పోలీస్‌ వర్గాలు.. సాయంత్రానికి ఉగ్రవాదులు భయంతోనే బాంబును పొరపాటున పేల్చి ఉంటారని తెలిపాయి. తన సహచర ఉగ్రవాదులంతా పోలీసులకు పట్టుబడటంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఫరీదాబాద్‌ నుంచి పారిపోయి తిరుగుతున్న ఉమర్‌ నబీ.. బాంబును పొరపాటున పేల్చేసి ఉంటాడని పేర్కొన్నాయి. పేలిన బాంబు కూడా పూర్తిగా తయారైన ఇంప్రూవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్‌ (ఐఈడీ) కాదని తెలిపాయి. ఆత్మాహుతి దాడి జరిగి ఉంటే ఆ ప్రదేశంలో గుంత పడి ఉండేదని, కారు లక్ష్యంపైకే నేరుగా దూసుకుపోయి ఉండేదని అభిప్రాయపడ్డాయి. అయితే, ఆత్మాహుతి ప్రతిసారి ఒకేలా జరగాలని ఏమీ లేదని మరికొందరు వాదిస్తున్నారు.

దర్యాప్తులో కీలకంగా ఐ20 కారు..

బాంబుపేలుడుపై దర్యాప్తులో దాడికి ఉపయోగించిన ఐ20 కారు (హెచ్‌ఆర్‌26సీఈ7674) కీలకంగా మారింది. ఈ కారు సోమవారం ఉదయం ఫరీదాబాద్‌ నుంచే ఢిల్లీకి వచ్చినట్లు గుర్తించారు. ఈ కారు సోమవారం ఉదయం 7.30 గంటలకు ఫరీదాబాద్‌లోని ఏషియన్‌ హాస్పిటల్‌ ముందు నుంచి వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఉదయం 8.30 గంటల సమయంలో ఈ కారు బదర్పూర్‌ టోల్‌ప్లాజాను దాటి ఢిల్లీలోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఢిల్లీ నగరంలో చాలాచోట్ల తిరిగిన కారు.. మధ్యాహ్నం 3.19 గంటల సమయంలో ఎర్రకోట సమీపంలోని పార్కింగ్‌ కాంప్లెక్స్‌ వద్దకు వచ్చి ఆగింది. అక్కడే దాదాపు మూడు గంటలపాటు ఉన్న తర్వాత సాయంత్రం 6.22 గంటలకు ఎర్రకోటవైపు వెళ్లిపోయింది. ఆ తర్వాత 24 నిమిషాలకు 6.52 గంటల సమయంలో పేలుడు సంభవించింది. ఈ కారు అక్టోబర్‌ 29వ తేదీన ఒక పెట్రోల్‌ బంక్‌ వద్ద ఉన్న పొల్యూషన్‌ చెక్‌ కేంద్రం వద్ద ఆగిన వీడియో కూడా బయటకు వచ్చింది. అదే రోజు ఈ కారును ఉమర్‌ నబీ కొనుగోలు చేయటం గమనార్హం. కారులో నుంచి ఉమర్‌ నబీతోపాటు మరో ఇద్దరు వ్యక్తులు బయటకు దిగి అక్కడ ఓ వ్యక్తితో కొద్దిసేపు మాట్లాడి పొల్యూషన్‌ చెక్‌ చేయించుకొని, తిరిగి కారులో వెళ్లిపోయారు. కాగా, ఫరీదాబాద్‌ నుంచి బయలుదేరినప్పటి నుంచి బాంబు పేలేవరకు దాదాపు 11 గంటలపాటు ఉమర్‌, మరో ఇద్దరు కారులో నుంచి బయటకు దిగలేదని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ కారు మొదటి యజమాని సల్మాన్‌కు ఇంటిని అద్దెకు ఇచ్చిన దినేశ్‌ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.


రోగినీ చంపేశాడు

కారు బాంబు పేలుడుకు కారణమైన ఉమర్‌ నబీ గతంలో జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ ఆసుపత్రిలో రెసిడెంట్‌ డాక్టర్‌గా ఉన్నప్పుడు ఓ రోగి మరణానికి కారణమయ్యాడని తాజాగా బయటపడింది. 2023లో నబీకి పై అధికారిగా ఉన్న రిటైర్డ్‌ డాక్టర్‌ జిలానీ రాంషో షాకింగ్‌ విషయాన్ని వెల్లడించారు. ఆ తర్వాత అతడిని ప్రభుత్వం విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించారు. కాగా, ఉమర్‌ కుటుంబ సభ్యుల డీఎన్‌ఏతో కారుబాంబు పేలుడు ప్రదేశంలో సేకరించిన పలు శరీర భాగాల డీఎన్‌ఏ సరిపోలినట్లు పోలీసులు తెలిపారు. బాంబు దాడికి ముందు అతడు మూరు రోజుల ముందే అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వివరించారు.

Updated Date - Nov 12 , 2025 | 06:21 AM