Hefty Fine Of 20 Lakh: బైకర్‌కు ఊహించని షాక్.. ఏకంగా 20 లక్షల ఫైన్...
ABN , Publish Date - Nov 08 , 2025 | 06:15 PM
హెల్మెట్ పెట్టుకోని కారణంతో ట్రాఫిక్ అధికారులు ఓ బైకర్‌కు ఊహించని షాక్ ఇచ్చారు. ఏకంగా 20 లక్షల రూపాయల ఫైన్ వేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్ నగరలో ఆలస్యంగా వెలుగు చూసింది.
ఓ బైకర్‌కు ట్రాఫిక్ పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. లక్ష రూపాయల బైక్‌కు ఏకంగా 20 లక్షల రూపాయల ఫైన్ వేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. గత మంగళవారం ముజఫర్‌నగర్‌కు చెందిన అన్మోల్ సింఘాల్ అనే యువకుడు రోజూలాగే తన బైక్‌పై బయటకు వెళ్లాడు. అయితే, న్యూ మండీ ఏరియాలోని రోడ్డులో ట్రాఫిక్ పోలీసులు అతడి బైక్‌ను ఆపారు. ట్రాఫిక్ పోలీసులు ఆపిన సమయంలో అతడి తలపై హెల్మెట్ లేదు. దానికి తోడు బండికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా లేవు.
దీంతో అధికారులు ఆ బైక్‌ను సీజ్ చేశారు. 20,74,000 రూపాయల ఫైన్ వేశారు. లక్ష రూపాయల బైక్‌కు 20 లక్షల ఫైన్ రావటంతో అన్మోల్ షాక్‌తో పాటు షేక్ అయ్యాడు. చలాన్‌ను ఫొటో తీసి తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశాడు. ఆ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ట్రాఫిక్ అధికారులపై విమర్శలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ అధికారులు స్పందించారు. 20 లక్షల రూపాయల ఫైన్‌ను నాలుగు వేలకు తగ్గించారు. దీనిపై ట్రాఫిక్ ఎస్పీ అతుల్ చౌబే మాట్లాడుతూ.. ‘ఈ కేసులో మోటార్ వెహికల్స్ యాక్ట్‌లోని సెక్షన్ 207 అప్లై అయ్యింది.
అయితే, ఎస్ఐ 207 తర్వాత ఎంవీ యాక్ట్ పెట్టడం మర్చిపోయాడు. 207 తర్వాత ఫైన్ అమౌంట్ నేరుగా పడ్డంతో పొరపాటు జరిగిపోయింది. అది కాస్తా 20,74,000 రూపాయలు అయిపోయింది. అదొక టెక్నికల్ ఎర్రర్ మాత్రమే. అతడు కట్టాల్సిన ఫైన్ 4 వేల రూపాయలు మాత్రమే’ అని స్పష్టం చేశారు. కాగా, మోటార్ వెహికల్స్ యాక్ట్‌లోని సెక్షన్ 207 ప్రకారం.. వాహనానికి సంబంధించిన సరైన డాక్యుమెంట్లు లేకపోతే ఆ వాహనాన్ని సీజ్ చేసే అధికారం అధికారులకు ఉంటుంది. ఈ కేసులో కూడా అదే జరిగింది. కానీ, పొరపాటు వల్ల 4 వేల ఫైన్ 20 లక్షలు అయింది.
ఇవి కూడా చదవండి
దేశవ్యాప్తంగా పట్టుబడుతున్న ఎర్రచందనం ఏపీదే : పవన్
18 మంది ఆడవాళ్లను చంపిన కేసులో శిక్ష.. జైల్లో రాజభోగాలు..