Saudia Airlines: విమానం చక్రం నుంచి అకస్మాత్తుగా నిప్పు రవ్వలు.. తృటిలో తప్పిన ప్రమాదం
ABN , Publish Date - Jun 16 , 2025 | 12:05 PM
హజ్ యాత్రికులతో లఖ్నవూలో ల్యాండయిన సౌదీ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. చక్రాల నుంచి పొగలు రావడాన్ని గమనించి పైలట్, ఎయిర్ పోర్టు సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఇంటర్నెట్ డెస్క్: సౌదీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆదివారం 250 హజ్ యాత్రికులతో లఖ్నవూ ఎయిర్‌పోర్టులో ల్యాండయిన సందర్భంగా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టాక్సీయింగ్ సమయంలో విమానం చక్రం నుంచి దట్టమైన పొగలు, నిప్పు రవ్వలు రావడంతో ఎయిర్‌పోర్టులో ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని నిలిపివేయడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది.
శనివారం రాత్రి జెడ్డా నుంచి బయలుదేరిన ఎస్‌వీ 3112 విమానం మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు లఖ్నవూలోని చౌదరి చరణ్ సింగ్ ఎయిర్‌పోర్టులో ల్యాండయ్యింది. అయితే, ట్యాక్సీయింగ్ సమయంలో విమానం చక్రం నుంచి పొగలు, నిప్పు రవ్వలు ఎగసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని నిలిపివేశారు. ఈలోపు ఎయిర్‌పోర్టులోని ఫైర్ అండ్ రెస్క్యూ బృందం వేగంగా స్పందించి పరిస్థితిని 20 నిమిషాల్లో అదుపులోకి తెచ్చింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి అపాయం కలగలేదు. సౌదీ టీమ్‌తో కలిసి పరిస్థితిని అదుపులోకి తెచ్చామని ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొన్నారు.
అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం గురించి మరువక మునుపే ఈ ఘటన జరగడంతో ఎయిర్‌పోర్టులో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆ తరువాత కొద్ది సేపటికి పరిస్థితి అదుపులోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇక ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరణించిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ మృతదేహాన్ని డీఎన్ఏ టెస్టుతో గుర్తించారు. ఆదివారం సాయంత్రం వరకు 47 మృతదేహాలకు డీఎన్‌ఏ విశ్లేషణ పూర్తయిందని అధికారులు తెలిపారు. అందులో 24 దేహాలను కుటుంబసభ్యులకు అప్పగించామని చెప్పారు. ఇక తమ వారి మృతదేహాల గుర్తింపు ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురుచూస్తున్న కుటుంబసభ్యులు, బంధువుల రోదనలతో అహ్మదాబాద్ నగర సివిల్ ఆస్పత్రి ప్రాంగణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
విమానం బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
జిప్‌లైన్ తెగడంతో 30 అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డ బాలిక.. షాకింగ్ వీడియో వైరల్
27 ఏళ్ల క్రితం ఎయిర్ ఇండియా తరహా ప్రమాదం.. ప్రాణాలు దక్కించుకున్న 11ఏ సీటు ప్యాసెంజర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి