RSS chief Mohan Bhagwat: సంఘ్ శాఖకుఎవరైనా రావచ్చు!
ABN , Publish Date - Nov 10 , 2025 | 02:51 AM
ఎవరైనా తమ శాఖలకు రావచ్చని, ముస్లింలు, క్రైస్తవులన్న బేధభావం లేదని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టంచేశారు. అయితే తాము ఫలానా అన్న ప్రత్యేకతను దూరం....
ఏ పార్టీకీ ఆర్‌ఎ్‌సఎస్ మద్దతివ్వదు
ఆర్‌ఎ్‌సఎస్ రిజిస్టర్ అయిన సంస్థ కాదు
అయినా మాపై మూడు సార్లు నిషేధం
తద్వారా ప్రభుత్వమే గుర్తించింది: భాగవత్
బెంగళూరు, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఎవరైనా తమ శాఖలకు రావచ్చని, ముస్లింలు, క్రైస్తవులన్న బేధభావం లేదని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టంచేశారు. అయితే తాము ఫలానా అన్న ప్రత్యేకతను దూరం పెట్టి, భరతమాత పుత్రులుగా రావాలన్నారు. సమాజంలో అందరినీ కలిసికట్టుగా ఉంచాలన్నదే తమ ఉద్దేశమన్నారు. సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వ్యక్తినో, రాజకీయ పార్టీనో ఆర్‌ఎ్‌సఎస్ సమర్థించదని.. విధానాలకే మద్దతిస్తుందని స్పష్టంచేశారు. ‘ఏ పార్టీకీ మద్దతివ్వం. ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనం’ అని పేర్కొన్నారు. ‘రామాలయ నిర్మాణానికి కాంగ్రెస్ మద్దతిచ్చి ఉంటే సంఘ్ కార్యకర్తలే దానికే ఓటేసి ఉండేవారు’ అని వ్యాఖ్యానించారు. ఆర్‌ఎ్‌సఎస్ రిజిస్టర్డ్ సంఘం కాదన్న ప్రియాంక్ ఖర్గే వ్యాఖ్యలను భాగవత్ ప్రస్తావిస్తూ.. ‘ఆర్‌ఎ్‌సఎస్ 1925లో ప్రారంభమైంది. బ్రిటిష్ ప్రభుత్వం వద్ద మేం రిజిస్టర్ చేసుకోవాలా? స్వాతంత్ర్యానంతరం రిజిస్ట్రేషన్ తప్పనిసరని చట్టాలు చెప్పలేదు. అయితే, ఐటీ విభాగం, కోర్టులు సంఘ్‌ను వ్యక్తుల సంఘంగా గుర్తించాయి. మాకు ఐటీ నుంచి మినహాయింపు కూడా ఇచ్చాయి. సంఘ్‌పై 3సార్లు నిషేధం విధించారు. తద్వారా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించినట్లయింది’’ అన్నారు. ‘‘రిజిస్టర్ కాని అంశాలు చాలానే ఉన్నాయి. హిందూ ధర్మం కూడా రిజిస్టరై లేదు’’ అని ఆయన పేర్కొన్నారు.