Government School: తప్పిన పెను ప్రమాదం.. కూలిన ప్రభుత్వ స్కూలు పైకప్పు..
ABN , Publish Date - Jul 26 , 2025 | 08:01 PM
Government School: ప్రమాదం జరిగిన సమయంలో అందులో 35 మంది చిన్నారులు ఉన్నారు. చనిపోయిన వారిలో ఆరు సంవత్సరాల బాలుడు కూడా ఉన్నాడు. ఈ విషాదంలో ప్రాణాలు పోగొట్టుకున్న చిన్న వయస్కుడు అతడే కావటం గమనార్హం.

రాజస్థాన్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల ప్రాణాలకు భద్రత లేకుండా పోతోంది. స్కూలు భవనాలు కూలటం, పైకప్పులు రాలటం వంటి సంఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. గవర్నమెంట్ స్కూలు పైకప్పుకూలి ఏడుగురు చిన్నారులు మృత్యువాతపడిన ఘటన మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. నాగౌర్ జిల్లాలోని ఖరియావాస్ ప్రాథమిక పాఠశాల భవనం పైకప్పు కూలింది. సంఘటన జరిగిన సమయంలో విద్యార్థులు ఎవ్వరూ భవనంలో లేకపోవటంతో ప్రమాదం తప్పింది. లేదంటే పెను విషాదం చోటుచేసుకునేది. భారీ సంఖ్యలో విద్యార్థులు ప్రాణాలు కోల్పోయేవారు.
క్లాస్ జరుగుతుండగా కూలిన పైకప్పు
కొన్ని రోజుల క్రితం జలావర్ జిల్లాలో స్కూలు భవనం కూలింది. క్లాస్ జరుగుతుండగా ఈ ఘోరం జరిగింది. పైకప్పు కూలి పిల్లలపై పడ్డంతో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొంతమంది విద్యార్థుల పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పిప్‌లోడి ప్రభుత్వ పాఠశాలలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఆరు, ఏడవ తరగతి విద్యార్థులు చదువుకుంటున్న క్లాస్ రూమ్ కూలిపోయింది.
ప్రమాదం జరిగిన సమయంలో అందులో 35 మంది చిన్నారులు ఉన్నారు. చనిపోయిన వారిలో ఆరు సంవత్సరాల బాలుడు కూడా ఉన్నాడు. ఈ విషాదంలో ప్రాణాలు పోగొట్టుకున్న చిన్న వయస్కుడు అతడే కావటం గమనార్హం. ఇక, ఈ సంఘటనలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ దారుణాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. స్కూలు భవనం పరిస్థితి బాగోలేదని చెప్పినా అధికారులు పట్టించుకోలేదని అంటున్నారు.
ఇవి కూడా చదవండి
నీట మునిగిన మహా నగరం.. 20 ఏళ్ల తర్వాత కూడా అదే పరిస్థితి
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో ఘోర తప్పిదం.. పోలీసుల కేసు నమోదు