Share News

Riya Paswan: రాహుల్ గాంధీ నాకు స్ఫూర్తి.. నేను జీవితాంతం పెళ్లి చేసుకోను.. బీహార్ యువతి

ABN , Publish Date - Jun 07 , 2025 | 04:47 PM

రాహుల్ గాంధీ స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని బీహార్ యువతి రియా పాస్వాన్ అన్నారు. తాను కూడా జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ప్రజాసేవకు అంకితమవ్వాలని భావిస్తున్నట్టు రాహుల్ గాంధీతో చెప్పడం నవ్వులు పూయించింది.

Riya Paswan: రాహుల్ గాంధీ నాకు స్ఫూర్తి.. నేను జీవితాంతం పెళ్లి చేసుకోను.. బీహార్ యువతి
Riya Paswan

ఇంటర్నెట్ డెస్క్: బీహార్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో స్థానిక యువతి ఆసక్తికర సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. ప్యాడ్ గర్ల్‌గా సోషల్ మీడియాలో పాప్యులర్ అయిన రియా పాస్వాన్ రాహుల్ గాంధీ స్ఫూర్తితో తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకొచ్చారు.

మహిళలను రాజకీయాల్లో ప్రోత్సహించేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి అభియాన్ కార్యక్రమం తన జీవితాన్ని ఎంతో మార్చిందని రియా వెల్లడించారు. దేశంలో అన్ని రంగాల్లో మంచి మార్పులు తీసుకొచ్చేందుకు రాజకీయాలే తొలి అడుగని ఆమె పేర్కొన్నారు. కానీ, అనేక మంది ముఖ్యంగా మహిళలు రాజకీయాల్లోకి వచ్చేందుకు విముఖత చూపుతారని చెప్పారు. రియా స్వయంగా అక్కడి స్లమ్ ఏరియాలో నివసిస్తుంటారు.

‘స్లమ్ ఏరియాలో మాకు ఓ పెద్ద టీమ్ ఉంది. శక్తి అభియాన్ సమయంలోనే ఈ బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ప్రజలు ఎదుర్కునే సమస్యలను మా శక్తి మేరకు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాము. అయితే, రానురాను ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం మా వద్దకే రావడం ప్రారంభించారు’ అని రియా తెలిపారు.


ఇలా అనర్గళంగా ఉపన్యసించిన రియా ప్రతిభకు రాహుల్ గాంధీ ముగ్ధుడయ్యారు. మంచి ప్రసంగాలంటూ కితాబునిచ్చారు. దీంతో, సంబరపడ్డ రియా.. ‘మీ లాగే నేను కూడా ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోదామని అనుకుంటున్నాను’ అని అనగా అక్కడున్న వారందరూ ఒక్కసారిగా పెద్దపెట్టున నవ్వారు. తాను రాజకీయ నేతగా మారి ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నట్టు రియా తెలిపారు. శక్తి అభియాన్ ద్వారానే తనకు రాజకీయాలు అంటే ఏంటో తెలిసిందని అన్నారు.


2022లో స్థానిక ఐఏఎస్ అధికారిని శానిటరీ ప్యాడ్‌ల పంపిణీ గురించి ప్రశ్నించాక రియా ఒక్కసారిగా దేశవ్యాప్త పాప్యులారిటీ సంతరించుకున్నారు. ఇక నవంబర్‌లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ జూన్ 6న బీహార్‌లో పర్యటించారు. బీజేపీ, జేడీయూ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

ఇవీ చదవండి:

పుతిన్ సాయం కోరిన పాక్.. మీ ఇన్‌ఫ్లుయెన్స్ వాడండని విజ్ఞప్తి

సింధు నదీ జలాల ఒప్పందం నిలుపుదలతో పాక్‌కు చుక్కలు.. భారత్‌కు వరుస లేఖలు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 07 , 2025 | 04:55 PM