Ludhiana Encounter: పంజాబ్‌లో ఎన్‌కౌంటర్.. పోలీసుల అదుపులో ఇద్దరు ఉగ్రవాదులు
ABN , Publish Date - Nov 20 , 2025 | 11:07 PM
ఐఎస్ఐతో సంబంధాలున్న ఇద్దరు ఉగ్రవాదులు పంజాబ్ పోలీసులకు చిక్కారు. ఓ టోల్ ప్లాజా వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డ ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు.
ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్‌లో తాజాగా జరిగిన ఎన్ కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు పోలీసులకు చిక్కారు. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐతో నిందితులిద్దరికీ సంబంధాలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. లుథియానాలో ఢిల్లీ-అమృత్‌సర్ హైవేపై ఉన్న లాడోవాల్ టోల్ ప్లాజా వద్ద గురువారం ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఉగ్రమూకలకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో కూడా సంబంధాలు ఉన్నట్టు కూడా వెలుగులోకి వచ్చింది. కీలక ఆపరేషన్ నిర్వహించి పోలీసులు ఉగ్రమూకలను పట్టుకున్నారు. టోల్ ప్లాజా సమీపంలో ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో పోలీసులు ప్రతికాల్పులు జరపడంతో వారు గాయాలపాలయ్యారు (Punjab Encounter Two Terrorist Injured).
ఉగ్రవాదులు ఇద్దరికీ తొలుత ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించి అనంతరం, సివిల్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. నిందితుల నుంచి పోలీసులు రెండు మేడ్ ఇన్ చైనా గ్రెనేడ్‌లు, ఐదు పిస్టల్స్, 50కి పైగా కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఇది మేజర్ ఆపరేషన్ అని పోలీస్ కమిషనర్ స్వపన్ శర్మ తెలిపారు. అయితే, ఈ విషయంలో ప్రస్తుతం ఇంతకు మించి చెప్పడం కుదరదని అన్నారు.
ఈ ముఠాకు చెందిన ముగ్గురిని పోలీసులు హర్యానా బిహార్ రాష్ట్రాల్లో అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా కీలక వివరాలు లభించాయి. వారి నెటవర్క్‌పై కీలక సమాచారం అందడంతో మిగిలిన వారిని అరెస్టు చేసేందుకు వలపన్నారు.
ఇదిలా ఉంటే, నవంబర్ 19, 20 మధ్య పంజాబ్‌లో రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఇటీవల జైలు నుంచి విడుదలై హర్జీందర్ సింగ్ అనే వ్యక్తి అమృత్‌సర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. విదేశీ గ్యాంగులతో సంబంధాలున్న అతడిపై ఐదు క్రిమినల్ కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇక ఫిరోజ్‌పూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గుర్సిమ్రన్ అనే మరో నిందితుడు మరణించాడు. ఆర్ఎస్ఎస్ వర్కర్ హత్య కేసులో అతడు నిందితుడిగా ఉన్నాడు.
ఇవి కూడా చదవండి...
మనీలాండరింగ్ కేసులో అల్ ఫలాహ్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడి అరెస్టు
తాజ్‌మహల్‌ను సందర్శించిన ట్రంప్ జూనియర్
Read Latest National News And Telugu News