Punjab Terror Plot Foiled: గ్రెనేడ్ దాడికి ఉగ్ర కుట్ర.. భగ్నం చేసిన పోలీసులు
ABN , Publish Date - Nov 13 , 2025 | 05:43 PM
పంజాబ్‌లో మరో ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. గ్రెనేడ్ దాడికి ప్లాన్ చేసిన పది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీసులు ఎక్స్ వేదికగా ప్రకటించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో తనిఖీలను ముమ్మరం చేసిన పోలీసులు మరో ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. పంజాబ్‌లో గ్రెనేడ్ దాడులకు కుట్ర పన్నిన వారిని అరెస్ట్ చేశామని లూథియానా పోలీసులు తాజాగా వెల్లడించారు. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ప్రోద్బలంతో గ్రెనేడ్ దాడికి సిద్ధమవుతున్న మాడ్యుల్‌ను పోలీసులు ఆదిలోనే అడ్డుకున్నారు. 10 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మలేషియాలోని ఆపరేటర్ల ద్వారా నిందితులు కుట్ర పన్నినట్టు పోలీసులు తెలిపారు. పాక్‌లోని హ్యాండ్లర్లతో సంప్రదింపులు జరుపుతూ హ్యాండ్ గ్రెనేడ్‌ల సేకరణ, డెలివరీ చేస్తున్నారని చెప్పారు. అధిక జనాభా ఉన్న ప్రాంతంలో గ్రెనేడ్ దాడి చేసి రాష్ట్రంలో అశాంతిని రేకెత్తించేందుకు నిందితులు ప్లాన్ చేసినట్టు పంజాబ్ డీజీపీ తెలిపారు (Punjab Grenade Attack Plot foiled).
ఇక ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో వార్తల్లో నిలిచిన అల్ ఫలాహ్ యూనివర్సిటీకి నేషనల్ ఎసెస్‌మెంట్ అండ్ ఎక్రిడిషన్ కౌన్సిల్ (న్యాక్) షోకాజ్ నోటీసులను జారీ చేసింది. యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో గుర్తింపునకు సంబంధించి తప్పుడు సమాచారం ఉండటంతో నోటీసులు జారీ చేసింది. న్యాక్ గుర్తింపు లేకపోయినా ఉన్నట్టు వెబ్‌సైట్‌లో పేర్కొన్నారని నోటీసుల్లో తెలిపింది. అల్ ఫలాహ్ ఆసుపత్రిలో పని చేస్తున్న డాక్టర్లు కొందరు ఢిల్లీ పేలుళ్లకు కుట్ర పన్నినట్టు వెలుగులోకి రావడంతో దర్యాప్తు సంస్థలు యూనివర్సిటీపై కూడా దృష్టి సారించాయి.
హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లా ధౌజ్ గ్రామంలో ఈ యూనివర్సిటీ ఉంది. 1997లో ఇంజినీరింగ్ కాలేజీగా దీన్ని ప్రారంభించారు. 2014లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి యూనివర్సిటీ హోదా వచ్చింది. ఈ యూనివర్సిటీకి అనుబంధంగా 2019లో అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి:
ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు.. డీఎన్ఏ అతడిదే..
Terror Accused Shaheen: అలా చేసిందంటే నమ్మశక్యంగా లేదు: షాహీన్ కుటుంబం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి