Manipur Orphanage Shooting: చిన్నారుల అనాథాశ్రమంపై కాల్పులు.. మణిపూర్‌లో దారుణం
ABN , Publish Date - Apr 10 , 2025 | 10:08 PM
మణిపూర్‌లో షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు చిన్నారుల అనాథాశ్రమంపై కాల్పులకు తెగబడ్డారు.

మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో తాజాగా దారుణం వెలుగు చూసింది. మాస్క్‌లు ధరించిన ఇద్దరు వ్యక్తులు చిన్నారుల అనాథాశ్రమంపై కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడి దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. సాగోల్‌బాండ్ మీనో లిరాక్ ప్రాంతంలోని అనాథాశ్రమంపై బుధవారం అర్ధరాత్రి 1.40 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. దాడికి పాల్పడిన ఇద్దరిలో ఒకరు ఏకంగా ఎనిమిది రౌండ్ల కాల్పులకు తెగబడినట్టు సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. మోకాళ్లపై కూర్చుని నిందితుడు కాల్పులకు దిగాడు. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. బలవంతపు వసూళ్లకు సంబంధించి ఈ దారుణం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కూకీ, మేయితీ ఘర్షణలు మొదలైన తరువాత ఇలాంటి నేరాల సంఖ్య పెరిగిందని కూడా పోలీసులు వెల్లడించారు.
సుమారు 30 మంది ఉంటున్న ఈ అనాథాశ్రమాన్ని యూనైటెడ్ సోషల డెవలప్‌మెంట్ అసోసియేషన్ నిర్విహిస్తోంది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ సారథ్యంలోని ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ పథకం కింద ఈ అనాథాశ్రమం నడుస్తోంది. ‘‘చిన్న పిల్లల నివాసంపై కాల్పులకు తెగబడటం చాలా దారుణం. ఈ దాడికి కారణమేంటో ఇంకా తెలీదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని మేము ఆశిస్తున్నాను. ఇక్కడ ఎంతో మంది చిన్నారులు ఉంటున్నారు. ఎవరికైనా ఎలాంటి అసంతృప్తి కలిగినా దాడులకు దిగకుండా ముందుగా మిమ్మల్ని సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నాము’’ అని అనాథాశ్రమం నిర్వాహకురాలు తెలిపారు. కాగా, ఈ దాడిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మరో ఘటనలో గుర్తు తెలియని వ్యక్తులు..ఇంఫాల్‌లోని రిమ్స్ డైరెక్టర్ ఇంట్లో ఓ గ్రనేడ్ వదిలి వెళ్లారు. బుధవారం రాత్రి 8.30 సమయంలో కుటుంబసభ్యులు గ్రనేడ్‌ను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌తో అక్కడికి చేరుకున్న పోలీసులు బాంబును నిర్వీర్యం చేసి స్వాధీనం చేసుకున్నారు. కూకీ మెయితీల మధ్య ఘర్షణల కారణంగా మణిపూర్‌లో నెలకొన్న అస్థిరతను ఆసరాగా చేసుకుని పలు సాయుధ గ్యాంగులు రాజధానితో పాటు పొరుగున ఉన్న కొన్ని జిల్లాల్లో బెదిరింపులకు, బలవంతపు వసూళ్లకు దిగుతున్నాయని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇవి కూడా చదవండి:
ఒక్కసారిగా మారిన వాతావరణం.. విరుచుకుపడిన దుమ్ము తుఫాను, వర్షాలు
తహవ్వుర్ రాణా అప్పగింత ప్రక్రియ మా హయాంలోనే మొదలైంది : చిదంబరం
నితీష్‌ను ఆ పదవిలో చూడాలనుంది.. బీజేపీ నేత బిగ్ స్టేట్‌మెంట్
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి