Bihar CM: బిహార్ సీఎంగా నితీశే!
ABN , Publish Date - Nov 17 , 2025 | 04:13 AM
బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమారే కొనసాగుతారా? మరోసారి ఆయనే సీఎంగా బాధ్యతలు చేపడతారా? అంటే సంబంధిత వర్గాలు అవుననే అంటున్నాయి.
19 లేదా 20న ప్రమాణ స్వీకారం
మంత్రివర్గ ఫార్ములా కూడా ఖరారు!
బీజేపీకి 15-16; జేడీయూకు 14 పదవులు
న్యూఢిల్లీ, నవంబరు 16: బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమారే కొనసాగుతారా? మరోసారి ఆయనే సీఎంగా బాధ్యతలు చేపడతారా? అంటే సంబంధిత వర్గాలు అవుననే అంటున్నాయి. ఈ నెల 19 లేదా 20న బిహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుందని చెబుతున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో బిహార్ మంత్రివర్గ ఫార్ములాను ఖరారు చేసినట్లు సమాచారం. నితీశ్‌నే సీఎంగా కొనసాగించాలని ఆ భేటీలో నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మంత్రివర్గంలో సింహభాగం పదవులు బీజేపీకే దక్కనున్నట్లు తెలుస్తోంది. 15-16 పదవులు కాషాయ పార్టీకి, 14 పదవులు జేడీయూకు, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ పార్టీ ఎల్జేపీకి మూడు, మరో కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝి పార్టీ హిందుస్థానీ అవామ్ మోర్చా(హెచ్‌ఏఎం)కు ఒకటి, రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్‌ఎల్‌ఎం)కు ఒకటి చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఇదీ ప్రక్రియ..
బిహార్‌లో 18వ అసెంబ్లీ ఏర్పాటుకు సంబంధించి ఆదివారం నోటిఫికేషన్ జారీ చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌కు వివరిస్తారు. సోమవారం నితీశ్‌కుమార్ క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తారు. 17వ శాసనసభను రద్దు చేస్తూ తీర్మానం ఆమోదిస్తారు. అనంతరం ఆయన తన రాజీనామాను గవర్నర్‌కు సమర్పిస్తారు. కూటమి నేతలు సమావేశమై ఎన్డీయే శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారు. బుధ లేదా గురువారం సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని భావిస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ షెడ్యూల్‌ను బట్టి ప్రమాణ స్వీకార తేదీని ఖరారు చేయనున్నారు. నితీశ్ పదోసారి బిహార్ సీఎంగా ప్రమాణం చేయనుండడం విశేషం. ఈ కార్యక్రమానికి ప్రధాని హాజరుకానున్నారు.