Nimisha Priya: నిమిష ప్రియ కేసుపై స్పందించిన విదేశాంగ శాఖ.. ఇది సున్నితమైన అంశమని ప్రకటన
ABN , Publish Date - Jul 17 , 2025 | 07:17 PM
యెమెన్‌లో మరణ శిక్ష పడ్డ కేరళ నర్సు విషయంలో అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామని విదేశాంగ శాఖ పేర్కొంది. ఇది చాలా సున్నితమైన అంశమని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

ఇంటర్నెట్ డెస్క్: యెమెన్ దేశస్థుడి హత్య కేసులో మరణ శిక్షను ఎదుర్కొంటున్న కేరళ నర్సు అంశం సున్నితమైనదని విదేశాంగ శాఖ తాజాగా పేర్కొంది. ఈ విషయంలో తాము నిమిష ప్రియ కుటుంబానికి అన్ని రకాలుగా సహాయసహకారాలు అందిస్తున్నామని వెల్లడించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
‘ఇది చాలా సున్నితమైన అంశం. భారత ప్రభుత్వం ఈ కేసులో అన్ని సహాయసహకారాలు అందిస్తోంది. నిమిష ప్రియ కుటుంబం కోసం ఓ లాయర్‌ను ఏర్పాటు చేసి అన్ని రకాల న్యాయపరమైన సహకారం అందిస్తున్నాము. కాన్సులార్ విజిట్స్‌కు కూడా అవకాశం కల్పించాము. స్థానిక అధికారులతో, కుటుంబసభ్యులతో నిరంతరం టచ్‌లో ఉంటూ పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాము’ అని ఆయన పేర్కొన్నారు.
నిమిష ప్రియ కుటుంబం చర్చలు జరిపేందుకు అదనపు సమయం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ క్రమంలో యెమెన్ అధికారులు జులై 16న మరణ శిక్ష అమలును వాయిదా వేశారని తెలిపారు. ఈ విషయంలో ఇతర మిత్ర దేశాలతో కూడా టచ్‌లో ఉన్నామని అన్నారు.
యెమెన్ జాతీయుడు, తన వ్యాపార భాగస్వామి అయిన తలాల్ అబ్దో మెహదీకి మత్తు మందు ఇచ్చి హత్య చేసినట్టు నిమిష ప్రియ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరో నర్సుతో కలిసి ఆమె ఈ హత్య చేసినట్టు అభియోగాలు దాఖలయ్యాయి. నిమిష ప్రియ ఈ ఆరోపణలను ఖండించింది. కోర్టులు మాత్రం ఆమె పిటిషన్లను కొట్టిపారేశాయి. ఈ క్రమంలో ఆమెకు మరణశిక్ష విధిస్తూ స్థానిక కోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కూడా యెమెన్ సుప్రీంకోర్టు 2023లో కొట్టేసింది. ఈ ఏడాది జనవరిలో యెమెన్ సుప్రీం పొలిటికల్ కౌన్సిల్ అధ్యక్షుడు మెహదీ అల్ మషాత్ మరణ శిక్ష అమలుకు ఆదేశాలు జారీ చేశారు.
పాలక్కాడ్‌కు చెందిన నిమిష 2008 యెమెన్‌కు వెళ్లారు. ఆ తరువాత తిరిగొచ్చిన ఆమె పెళ్లి తరువాత 2011లో భర్తతో కలిసి మరోసారి యెమెన్‌కు వెళ్లారు. 2014 నాటి యెమెన్ అంతర్యుద్ధం నేపథ్యంలో భర్త తమ కూతురితో కలిసి తిరిగొచ్చేశారు. నిమిష మాత్రం యెమెన్‌లోనే ఉండిపోయింది. ఈ క్రమంలోనే మెహదీతో కలిసి ఆమె స్థానికంగా ఓ నర్సింగ్ హోం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో వారి మధ్య తలెత్తిన వివాదాలు అతడి హత్యకు దారి తీశాయి. తనని తాను కాపాడుకునేందుకు తీవ్ర ఒత్తిడిలో ఈ హత్య చేసినట్టు ఆమె వాదించింది. ఇక నిమిషకు క్షమాభిక్ష పెట్టేదే లేదని మెహదీ కుటుంబం స్పష్టం చేస్తోంది. దీంతో, నిమిష ప్రియ ఉదంతంలో ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి:
బిహార్‌లో షాకింగ్ ఘటన.. ఐసీయూలోని పేషెంట్‌పై కాల్పులు జరిపి హత్య
కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రి జేపీ మంత్రి సౌదీ పర్యటన
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి