Share News

Speed Limit on Google Maps: గూగుల్ మ్యాప్స్ కొత్త ప్రాజెక్టు.. రోడ్డు ప్రమాదాలు సగానికి తగ్గేలా ప్లాన్

ABN , Publish Date - Nov 12 , 2025 | 07:37 PM

యూపీలోని గౌతం బుద్ధనగర్ జిల్లా పోలీసులు గూగుల్ మ్యాప్స్‌తో కలిసి ఓ కొత్త ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా జిల్లాలోని రోడ్లపై స్పీడ్ లిమిట్స్ గూగుల్ మ్యాప్స్‌లో కనిపిస్తాయి. తద్వారా వాహనదారులు తమ వేగాన్ని నియంత్రించుకునే అవకాశం ఉంటుంది. దేశంలో ఇలాంటి ప్రాజెక్టును చేపట్టడం ఇదే తొలిసారి.

Speed Limit on Google Maps: గూగుల్ మ్యాప్స్ కొత్త ప్రాజెక్టు.. రోడ్డు ప్రమాదాలు సగానికి తగ్గేలా ప్లాన్
Google Maps speed limit in UP

ఇంటర్నెట్ డెస్క్: రోడ్డు ప్రమాదాల నివారణ కోసం యూపీ‌లోని గౌతంబుద్ధ నగర్ జిల్లా పోలీసులు గూగుల్‌తో జట్టుకట్టారు. దేశంలోనే తొలిసారిగా గూగుల్ మ్యాప్స్‌పై స్పీడ్ లిమిట్స్‌ను చూపించే కొత్త ప్రాజెక్టును ప్రారంభించారు. జిల్లా పోలీస్ కమిషనరేట్, గూగుల్ మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది. యూపీ డీజీపీ రాజీవ్ కృష్ణన్ ఈ ప్రాజెక్టును వర్చువల్‌గా ప్రారంభించారు. కొంతకాలం పాటు ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు (Speed Limits on Google Maps).

ఈ ప్రాజెక్టులో భాగంగా నోయిడా సహా జిల్లాలోని అనేక రోడ్లల్లో గరిష్ఠ ప్రయాణ వేగానికి సంబంధించిన వివరాలు గూగుల్ మ్యాప్స్‌లో కనిపిస్తాయి. ఏయే రోడ్లల్లో ప్రమాదాలకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయో కూడా మ్యాప్స్ ద్వారా యూజర్లకు తెలుస్తుంది. దీంతో, వాహనదారుల అవగాహన పెరిగి మరింత అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం చిక్కుతుంది. వాహనదారుల భద్రతను పెంచేందుకు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. రోడ్డు ప్రమాదాల సంఖ్యను సగానికి తగ్గించేలా లక్ష్యం పెట్టుకుంది (GBN Nagar Google Maps Speed Limit Project).


రహదారులపై ప్రయాణించే సమయంలో వాహనదారులకు తమ వేగంతో పాటు ఆ రోడ్డుపై స్పీడ్ లిమిట్ కూడా గూగుల్ మ్యాప్స్‌లో స్పష్టంగా కనిపిస్తుందని పోలీస్ కమిషనర్ లక్ష్మీ సింగ్ ఈ సందర్భంగా తెలిపారు. తమంతట తాముగా క్రమశిక్షణ పాటించేలా ఈ ఫీచర్ వాహనదారులను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. యూపీ ప్రభుత్వ గణాంకాల ప్రకారం, రాష్ట్రంలో 53 శాతం రోడ్డు ప్రమాదాలకు అతివేగమే కారణం. ఏటా సుమారు 22 వేల మంది రోడ్డు ప్రమాదాలకు బలవుతున్నారు. రాష్ట్రంలో వివిధ నేర ఘటనల్లో మరణిస్తున్న వారికంటే ఈ సంఖ్య నాలుగు రెట్లు అధికం.


ఇవి కూడా చదవండి..

మరో కశ్మీరీ డాక్టర్ అదృశ్యం.. దర్యాప్తు ఏజెన్సీలు అప్రమత్తం

ఢిల్లీ పేలుళ్లు.. నిధులు సమీకరణలో కీలకంగా మహిళా డాక్టర్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 12 , 2025 | 07:44 PM