Nissar Ul Hassan Missing: మరో కశ్మీరీ డాక్టర్ అదృశ్యం.. దర్యాప్తు ఏజెన్సీలు అప్రమత్తం
ABN , Publish Date - Nov 12 , 2025 | 06:43 PM
ఢిల్లీ పేలుళ్ల తరువాత కశ్మీరీ డాక్టర్ నిసార్ ఉల్ హసన్ కనిపించకుండా పోయాడు. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు 2023లోనే అక్కడి ప్రభుత్వం హసన్‌ను డిస్మిస్ చేసింది. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ పేలుళ్ల అనంతరం ఓ కశ్మీరీ డాక్టర్ కనిపించకుండా పోవడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు డా. నిసార్ ఉల్ హసన్‌ను 2023లో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం డిస్మిస్ చేసింది. అయితే, ఢిల్లీ పేలుళ్ల ఘటన తరువాత అతడూ కనిపించకుండా పోవడంతో దర్యాప్తు సంస్థలు అప్రమత్తమయ్యాయి (Dr Nissar Ul Hassan missing).
జాతీయ మీడియా కథనాల ప్రకారం, శ్రీనగర్‌లోని ఎస్ఎమ్‌హెచ్ఎస్ ఆసుపత్రిలో డా. హసన్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. అయితే, హర్యానాలోని ఫరీదాబాద్ కేంద్రంగా పన్నిన ఉగ్ర కుట్రతో డా. హసన్‌కు కూడా సంబంధం ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో పనిచేస్తున్న కొందరు డాక్టర్లు ఈ ఉగ్రకుట్రకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డా. హసన్ కూడా అదృశ్యం కావడంతో దర్యాప్తు ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి. ఇక ఉగ్ర కుట్ర కేసులో తాము పూర్తిగా సహకరిస్తున్నట్టు అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఓ ప్రకటనలో తెలిపింది (Delhi Blasts Case Investigation).
ఢిల్లీ పేలుళ్లకు వాడిన కారును డా. ఉమర్ ఉన్ నబీ నడిపినట్టు ఇప్పటికే తేలింది. ఈ పేలుడులో అతడు కూడా మృతి చెందాడు. అయితే, అతడి పేరిట మరో కారు కూడా రిజిస్టర్ అయి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఢిల్లీ పేలుళ్ల కోసం ఈ కారును కూడా వాడినట్టు అనుమానాలు ఉన్నాయి. నకిలీ అడ్రస్‌తో 2017లో ఈ కారు రిజిస్ట్రేషన్ జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఢిల్లీ పేలుళ్ల వెనుక డాక్టర్‌ల నెట్‌వర్క్ ఉందని ఇప్పటికే బయటపడింది. ఈ నెట్‌వర్క్‌లో 9 లేదా 10 మంది ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీ పేలుళ్లు.. నిధులు సమీకరణలో కీలకంగా మహిళా డాక్టర్
జైష్ ఉగ్రమూకలకు మహిళా డాక్టర్ నాయకత్వం.. ఫరీదాబాద్ ఉగ్రకుట్ర కేసులో కీలక విషయాలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి