Share News

Delhi Car Explosion: ఢిల్లీలో కారు పేలుడుకు ‘మదర్‌ ఆఫ్‌ సైతాన్‌’?

ABN , Publish Date - Nov 17 , 2025 | 04:19 AM

మదర్‌ ఆఫ్‌ సైతాన్‌.. ఢిల్లీలో ఎర్రకోట వద్ద కారు పేలుడుకు ఉగ్రవాదులు ఉపయోగించిన పేలుడు పదార్థం ఇదేనా? ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు..

Delhi Car Explosion: ఢిల్లీలో కారు పేలుడుకు ‘మదర్‌ ఆఫ్‌ సైతాన్‌’?

  • అత్యంత అస్థిరమైన పేలుడు పదార్థం.. వేడి, రాపిడి, తాకిడితో పేలే స్వభావం

  • టీఏటీపీకి ఉన్న ఆ అస్థిరత్వం వల్లనే ఆకస్మికంగాపేలి ఉండొచ్చని అంచనా

న్యూఢిల్లీ, నవంబరు 16: ‘మదర్‌ ఆఫ్‌ సైతాన్‌’.. ఢిల్లీలో ఎర్రకోట వద్ద కారు పేలుడుకు ఉగ్రవాదులు ఉపయోగించిన పేలుడు పదార్థం ఇదేనా? ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు.. తొలుత ఈ పేలుడుకు ఉపయోగించిన ‘ఇంప్రొవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్‌ (ఐఈడీ) తయారీకి టెర్రరిస్టులు పెద్ద ఎత్తున అమ్మోనియం నేట్రేట్‌ వాడి ఉంటారని భావించారు. కానీ వారు.. ‘మదర్‌ ఆఫ్‌ సైతాన్‌’గా పిలిచే అత్యంత అస్థిరమైన, ప్రమాదకరమైన రసాయనాల సమ్మేళనాన్ని అమ్మోనియం నైట్రేట్‌తో కలిపి వినియోగించినట్టు ఇప్పుడు భావిస్తున్నారు. దాని సాంకేతిక నామం.. ట్రైఎసిటోన్‌-ట్రైపెరాక్సైడ్‌ (టీఏటీపీ). 2-3 కిలోల అమ్మోనియం నైట్రేట్‌కు ఫ్యూయల్‌ ఆయిల్‌, ఈ టీఏటీపీని కలిపి ఈ పేలుడు పదార్థాన్ని తయారుచేశారని.. దాని బరువు 40-50 కిలోల దాకా ఉంటుందని అంచనా. పేలిపోయిన ఐ20 కారు వెనుక సీటులో ఒక పెద్ద సంచి ఉండడాన్ని దర్యాప్తు అధికారులు సీసీ టీవీ ఫుటేజీలో గుర్తించారు. అది సీటులో దాదాపు సగభాగం మేర ఆక్రమించి ఉందని.. ఉగ్రవాదులు తయారుచేసిన ఐఈడీ ఎంత పెద్దదో చెప్పడానికి అదే సంకేతమని దర్యాప్తు అధికారులు పేర్కొంటున్నారు. కాగా.. ఆరోజు బాంబు పేలినప్పుడు దాని ప్రకంపనలు భూగర్భంలో 50 మీటర్ల వరకూ వ్యాపించాయని, కారులో ఉన్న ముగ్గురి ఉగ్రవాదుల శరీరభాగాలు సైతం 50 మీటర్ల విస్తీర్ణంలో చెల్లాచెదురుగా పడ్డాయని అధికారులు చెబుతున్నారు.


తేలిగ్గా దొరికే రసాయనాలతోనే

టీఏటీపీకి అత్యంత అస్థిరమైన పేలుడు పదార్థంగా పేరుంది! వేడి, రాపిడి, షాక్‌, స్థిరవిద్యుత్తు వంటివాటికి స్పందించే టీఏటీపీని తయారుచేయడం, తరలించడం, కలపడం.. చాలా ప్రమాదకరం. అందరికీ సులువుగా దొరికే హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, ఎసిటోన్‌ వంటి రసాయనాలతో అత్యంత సులభంగా తయారుచేయగలిగే ‘మిలటరీ గ్రేడ్‌’ పేలుడు పదార్థమిది. ఈ టీఏటీపీ ఆధారిత పేలుడుపదార్థాలు.. ఒక టీఎన్‌టీ శక్తిలో దాదాపు 80 శాతం మేర ప్రభావం చూపుతాయని సీనియర్‌ భద్రతాధికారి ఒకరు తెలిపారు. కాగా.. టీఏటీపీని పేల్చడానికి ఎలాంటి డిటొనేటరూ అక్కర్లేదు. కేవలం వేడి ఎక్కువగా ఉంటే చాలు పేలిపోతుంది. కిందటి శుక్రవారం (నవంబరు 14న) శ్రీనగర్‌లోని నౌగామ్‌ పోలీస్‌ స్టేషన్‌లో పేలుడుకు కారణమిదే. ఎర్రకోట వద్ద కారు పేలుడుకు కూడా ఈ సున్నితత్వమే కారణమై ఉంటుందని.. అది ఆత్మాహుతి దాడి అయ్యుండకపోవచ్చని, పేలుడు పదార్థాన్ని తరలిస్తుండగా ఆకస్మికంగా పేలిపోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి పేలుళ్లకు కుట్ర పన్నినప్పుడు ప్రాణనష్టం మరింత ఎక్కువగా ఉండడానికి పదునైన లోహపుముక్కలు, బాల్‌ బేరింగ్స్‌ వంటివాటిని వాడుతుంటారు. ఎర్రకోట వద్ద జరిగిన పేలుడులో అలాంటివేవీ లేకపోవడం.. అది ఆకస్మిక పేలుడు అయ్యుండొచ్చన్న వాదనకు మద్దతునిస్తోందని అధికారులు గుర్తుచేస్తున్నారు. వేడి, రాపిడి, తాకిడి వంటివాటివల్ల టీఏటీపీ ప్రాథమిక పేలుడు పదార్థంగా పనిచేసి ఉండొచ్చని.. ఆక్సిడైజర్‌గా పనిచేసే అమ్మోనియం నైట్రేట్‌, ఫ్యూయల్‌ ఆయిల్‌ కారణంగా పేలుడు తీవ్రత బాగా పెరిగిందని వారు విశ్లేషిస్తున్నారు.


2015లో ఫ్రాన్స్‌లో 130 మంది మృతి

మదర్‌ ఆఫ్‌ సైతాన్‌ బాంబు (టీఏటీపీ)ను.. విద్రోహులు గతంలో చాలా చోట్ల పేలుళ్లకు వినియోగించారు. ఉదాహరణకు.. 2005లో లండన్‌లోని ప్రజా రవాణా వ్యవస్థనే లక్ష్యంగా చేసుకుని జరిగిన నాలుగు ఆత్మాహుతి దాడులకు ప్రధానంగా ఉపయోగించింది టీఏటీపీనే. ఆ పేలుళ్లలో 52 మంది చనిపోయారు. ఫ్రాన్స్‌ రాజధాని పారి్‌సలో 2015లో జరిగిన ఆత్మాహుతి దాడులకూ వాడింది టీఏటీపీనే. ఆ పేలుళ్లలో 130 మంది ప్రాణాలు కోల్పోయారు. 2016 మార్చి నెలలో బ్రసెల్స్‌లో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 32 మరణించారు. పేలుడు వాడింది.. టీఏటీపీ. 2017 మే నెలలో ప్రముఖ సింగర్‌ అరియానా గ్రాండే ఈవెంట్‌లో పేలుడుకు సూసైడ్‌ బాంబర్‌ వినియోగించింది టీఏటీపీ ఐఈడీ. ఆ పేలుడు కారణంగా 22 మంది చనిపోయారు.

Updated Date - Nov 17 , 2025 | 04:21 AM