Rajasthan Fake Cop: తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పోలీస్ అకాడమీలో చేరి.. రెండేళ్ల పాటు..
ABN , Publish Date - Jul 05 , 2025 | 08:19 PM
తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రాజస్థాన్ పోలీసు అకాడమీ ట్రైనింగ్ సెషన్లలో పాల్గొంటూ రెండేళ్లపాటు అందరి కళ్లూ కప్పి తిరిగిన ఓ యువతిని ఎట్టకేలకు పోలీసుల అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఉదంతం రాష్ట్రంలో కలకలం రేపుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: పోలీస్ ఉద్యోగ పరీక్షల్లో పాస్ కాకపోయినా తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రాజస్థాన్ పోలీసు అకాడమీలో చేరిన ఓ యువతి ఏకంగా రెండేళ్లపాటు అక్కడి కార్యక్రమాల్లో పాల్గొంది. ఏడాదిగా పరారీలో ఉన్న నిందితురాలు మోనా బుగాలియాను పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. దీంతో, యువతి ఉదంతం మరోసారి వార్తల్లోకి ఎక్కింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మోనా బుగాలియా అలియాస్ మూలీ దేవి ఎలాంటి రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో పాస్ కాలేదు. అయినా కూడా అందరి కళ్లు కప్పి ట్రెయినీ పోలీసుగా అకాడమీలో చేరి రెండేళ్ల పాటు తన ఆటలు సాగించుకుంది. 2021లో పరీక్ష రాసి ఫెయిలయ్యాక ఆమె తన పేరును మూలీ దేవిగా మార్చుకుని తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సృష్టించింది. ఆ తరువాత తాను ఎస్సై పరీక్షలో నెగ్గినట్టు, ఉద్యోగానికి ఎంపికైనట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంది. ఈ క్రమంలోనే కొత్తగా ఎంపికైన ఎస్సైల వాట్సాప్ గ్రూపులో కూడా చేరింది. తనని తాను మునుపటి బ్యాచ్ క్యాండిడేట్‌గా చెప్పుకుంటూ రాజస్థాన్ పోలీసు అకాడమీలోకి చేరింది. స్పోర్ట్స్ కోటాలో జాబ్ వచ్చినట్టు చెప్పుకుంది.
ఆ తరువాత రెండేళ్ల పాటు ఆమె పోలీసు అకాడమీలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంది. ఔట్ డోర్ డ్రిల్స్‌లో పాలుపంచుకుంది. ఉన్నతాధికారులతో కలిసి ఫొటోలకు పోజులిచ్చింది. పోలీసు అధికారిగానే సోషల్ మీడియాలో ఇతర అభ్యర్థుల కోసం స్ఫూర్తివంతమైన కథనాలు పోస్టు చేసేది. ఒకానొక సందర్భంలో ఏకంగా ఐపీఎస్ అధికారుల సమక్షంలో స్టేజిపై ప్రసంగించింది. ఈ క్రమంలోనే కొందరు ట్రెయినీ అధికారులకు ఆమెపై అనుమానం కలిగింది. వారు పైఅధికారులకు ఫిర్యాదు చేయడంతో మోనా ఉదంతం వెలుగులోకి వచ్చింది. పోలీసు శాఖ అంతర్గత విచారణ సందర్భంగా ఆమె తను చేసిన నేరాన్ని అంగీకరించింది. కుటుంబాన్ని ఇంప్రెస్ చేసేందుకు, పోలీస్ జాబ్‌తో వచ్చే సౌకర్యాలను ఎంజాయ్ చేసేందుకు ఈ నాటకమాడినట్టు తెలిపింది.
ఈ క్రమంలోనే తప్పించుకుని పారిపోయిన ఆమె చివరకు పోలీసులకు చిక్కింది. ఇక ఆమె అద్దెకు ఉంటున్న ఇంటి నుంచి పోలీసులు వివిధ రకాల నకిలీ డాక్యుమెంట్లు, రూ.7లక్షలు, పోలీసు అకాడమీకి చెందిన ప్రశ్నాపత్రాలు, మూడు ఫేక్ యూనిఫామ్‌లను స్వాధీనం చేసుకున్నారు. బుగాలియా స్వస్థలం రాష్ట్రంలోని నాగోర్ జిల్లా నింబాకే బాస్ గ్రామమని తెలిపారు. ఆమె తండ్రి ట్రక్ డ్రైవర్ అని చెప్పారు. ఆమె ప్రభుత్వ పరీక్ష ఏదీ పాస్ కాలేదన్న విషయం అధికారిక రికార్డుల ద్వారా ధ్రువీకరించారు. మరోవైపు, ఈ విషయమై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది సాధారణ పొరపాటు కాదని వ్యవస్థాగత లోపమని కొందరు సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
అమెరికాతో వాణిజ్య ఒప్పందం.. దేశ ప్రయోజనాలే ముఖ్యమన్న కేంద్ర మంత్రి
షాకింగ్ రోడ్డు ప్రమాదం.. స్కార్పియో కారు అదుపు తప్పి బిల్ బోర్డు స్తంభాన్ని ఢీకొట్టడంతో..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి