Share News

Modi Hails Kumram Bheem: కుమ్రం భీమ్‌ పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకం

ABN , Publish Date - Oct 27 , 2025 | 01:40 AM

నిజాం దురాగతాలపై యోధుడు కుమ్రం భీమ్‌ పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు....

Modi Hails Kumram Bheem: కుమ్రం భీమ్‌ పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకం

  • ‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ/ఆసిఫాబాద్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): నిజాం దురాగతాలపై యోధుడు కుమ్రం భీమ్‌ పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. కుమ్రం భీమ్‌ తన ధైర్యం, త్యాగంతో లక్షలాది మంది హృదయాలపై ముఖ్యంగా గిరిజన సమాజంపై చెరగని ముద్ర వేశారన్నారు. కుమ్రం భీమ్‌ 40 సంవత్సరాలు మాత్రమే జీవించినా.. ఆయన జీవితం ఎన్నో పాఠాలను నేర్పుతుందని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఆదివారం ప్రధాని తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్‌ కీ బాత్‌’ 127వ ఎపిసోడ్‌లో ‘జల్‌, జంగల్‌, జమీన్‌ హమారా’ నినాదం కోసం ప్రాణాలర్పించిన ఆదివాసీ పోరాట యోధుడు కుమ్రం భీం గురించి ప్రస్తావించి నివాళులర్పించారు. ‘‘నేను ఇప్పుడు మిమ్మల్ని గతకాలపు జ్ఞాపకాల్లోకి తీసుకెళతాను. 20వ శతాబ్ద ప్రారంభాన్ని ఊహించుకోండి! అప్పుడు స్వాతంత్య్రం వస్తుందనే ఆశ కనుచూపు మేరలో లేదు. బ్రిటీ్‌షవారు భారతదేశం అంతటా అడ్డూఅదుపు లేకుండా దోపిడీ సాగిస్తున్నారు. హైదరాబాద్‌ ప్రజలకు అణచివేత కాలం మరింత భయంకరం. క్రూరమైన, నిర్దయుడైన నిజాం దురాగతాలను కూడా వారు భరించవలసి వచ్చింది. పేదలు, అణగారిన వర్గాలు, ఆదివాసీలపై దౌర్జన్యాలు వర్ణనాతీతం. వారి భూములను లాక్కున్నారు. భారీగా పన్నులు విధించారు. ఈ అన్యాయాన్ని నిరసించిన వారి చేతులను నరికివేశారు. ఈ దురాగతాలకు వ్యతిరేకంగా 20 ఏళ్ల యువకుడు నిలబడ్డాడు. ఆ పేరు చెప్పే ముందు అతని ధైర్యం గురించి నేను మీకు చెబుతాను. నిజాంకు వ్యతిరేకంగా ఒక్కమాట మాట్లాడటం కూడా నేరంగా పరిగణించే ఆ రోజుల్లో సిద్ధిఖీ అనే నిజాం అధికారిని ఆ యువకుడు బహిరంగంగా సవాలు చేశాడు. రైతుల పంటలను జప్తు చేయడానికి సిద్ధిఖీని నిజాం పంపాడు. కానీ అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో సిద్ధిఖీని ఆ యువకుడు చంపాడు. నిజాం ప్రభుత్వ పోలీసుల నుంచి తప్పించుకుని వందల కిలోమీటర్ల దూరంలోని అసోంకు చేరుకున్నాడు. 1940లో ఆయనను నిజాం మనుషులు హత్య చేశారు. ఆ గొప్ప వ్యక్తి పేరు కుమ్రం భీమ్‌. ఈ నెల 22న ఆయన జయంతిని జరుపుకున్నాం. కుమ్రం భీమ్‌ ఎక్కువ కాలం జీవించలేదు. కానీ తన జీవితకాలంలో అసంఖ్యాక ప్రజల హృదయాలపై.. ముఖ్యంగా ఆదివాసీ సమాజంపై చెరగని ముద్ర వేశారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారిలో కొత్త శక్తిని నింపారు’’ అని ప్రధాని అన్నారు. వచ్చే నెల 15న మనం ‘ఆదివాసీ గౌరవ దినోత్సవం’ నిర్వహించుకోనున్నామని చెప్పారు. ‘‘ఇది భగవాన్‌ బిర్సా ముండా జయంతి శుభ సందర్భం. దేశ స్వాతంత్య్రం కోసం, ఆదివాసీ సమాజ హక్కుల కోసం ఆయన చేసిన కృషి సాటిలేనిది’’ అంటూ నివాళులర్పించారు.


వందేమాతర గీతం 150 ఏళ్ల వేడుకలు

వందేమాతర గీతం భారతీయుల్లో నిరంతరం దేశభక్తిని, ఐక్యతను నింపుతూ ఉంటుందని, అది భారతీయతకు శక్తిమంతమైన చిహ్నమని మోదీ అన్నారు. వందేమాతరం అనే ఒక్కపదమే మన గుండెల్లో ఎన్నో భావోద్వేగాలను కలిగిస్తుందని, శక్తినిచ్చి భరతమాత బిడ్డలుగా మన బాధ్యతలను గుర్తుచేస్తుందని చెప్పారు. బంకించంద్ర ఛటర్జీ రాసిన వందేమాతర గీతం వచ్చే నెల 7వ తేదీతో ఈ ఏడాది 150వ ఏట అడుగిడుతుందని, ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో ఈ ఏడాది పండుగలు మరింత ఘనంగా జరిగాయన్నారు. భారతీయ కాఫీ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ సంపాదించుకుంటోందన్న మోదీ.. ఒడిసాలోని కోరాపుట్‌ సహా అనేక ప్రాంతాలను ప్రస్తావించారు.

21వ శతాబ్దం భారత్‌-ఆసియాన్‌ దేశాలదే

ఇరవైఒకటో శతాబ్దం భారత్‌-ఆసియాన్‌ దేశాలదేనని మోదీ చెప్పారు. ఆసియాన్‌ దేశాల విజన్‌ 2045, వికసిత్‌ భారత్‌ 2047 లక్ష్యాలు ఒకటేనన్నారు. రాబోయే తరాలకు సమృద్ధికరమైన, ఉజ్వలమైన భవిష్యత్‌ అందించే దిశగా చర్యలు తీసుకుందామన్నారు. మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో జరుగుతున్న ఆసియాన్‌ దేశాల సదస్సులో ఆయన వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. ప్రపంచ జనాభాలో నాలుగో వంతు ఆసియాన్‌ దేశాల్లోనే ఉన్నారని, భారత్‌-ఆసియాన్‌ దేశాలు భౌగోళికంగానే కాక ఉమ్మడి చారిత్రక విలువలు, కలిగి ఉన్నాయన్నారు. భారత్‌-ఆసియాన్‌ దేశాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముందడుగు వేస్తున్నాయని, ఈ భాగస్వామ్యం ప్రపంచ సుస్థిర అభివృద్ధికి బలమైన పునాదిగా మారుతుందని మోదీ చెప్పారు. ప్రతి విపత్తులోనూ ఆసియాన్‌ దేశాలకు భారత్‌ అండగా ఉందన్నారు.

Updated Date - Oct 27 , 2025 | 06:36 AM