LLRM Hospital Negligence: షాకింగ్ ఘటన.. డాక్టర్ల కునుకు.. రోడ్డు ప్రమాద బాధితుడి మృతి
ABN , Publish Date - Jul 29 , 2025 | 01:18 PM
యూపీలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాద బాధితుడికి సకాలంలో వైద్యం అందక కన్నుమూశాడని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. బాధితుడు బెడ్‌పై రక్తమోడుతూ విలవిల్లాడుతున్నా జూనియర్ డాక్టర్లు పట్టించుకోకుండా కునుకు తీశారని అన్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని లాలా లజ్‌పత్ రాయ్ మెమోరియల్ ఆసుపత్రిలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రోడ్డుప్రమాద బాధితుడి మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. పేషెంట్ బెడ్‌పై రక్తమోడుతూ ఉంటే డాక్టర్లు కునుకు తీశారని బాధితులు మండిపడ్డారు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సునీల్ అనే వ్యక్తిని పోలీసులు లాలా లజ్‌పత్ రాయ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. రక్తస్రావం అవుతున్న అతడిని ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు. అయితే, రక్తమోడుతున్న సునీల్‌కు తక్షణ వైద్య సాయం అందలేదని అతడి కుటుంబసభ్యులు తెలిపారు. స్ట్రెచర్‌పై ఉన్న సునీల్ నరకం అనుభవిస్తున్నా అక్కడున్న డ్యూటీ డాక్టర్లు భూపేశ్ కుమార్ రాయ్, అనికేత్ స్పందించకుండా కునుకు తీశారని మండిపడ్డారు.
ఇందుకు సంబంధించి సర్క్యూలేట్ అవుతున్న వీడియోలో ఓ డాక్టర్ కుర్చీలో కూర్చుని టేబుల్‌పై కాళ్లు పెట్టుకుని నిద్రిస్తున్న వైనం కనిపించింది. చంటిపిల్లను ఎత్తుకున్న ఓ మహిళ డాక్టర్‌ను నిద్రలేపేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో డ్యూటీ ఇన్ చార్జ్ డాక్టర్ శశాంక్ జిందాల్ అక్కడ లేరు. అయితే, విషయం తెలియగానే ఆయన వచ్చి పేషెంట్‌కు వైద్యం ప్రారంభించారు. కాలికి కట్టుకట్టి, ఐవీ ఫ్లూయిడ్స్ అందించారు. అయితే, సునీల్ నేటి ఉదయం కన్నుమూశారు.
తక్షణ వైద్య సాయం అందకపోవడం వల్లే సునీల్ మృతి చెందాడని అతడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రికి వచ్చేటప్పటికే సునీల్ పరిస్థితి క్రిటికల్‌గా ఉందని డా.జిందాల్ తెలిపారు.
ఈ ఘటనపై ఆసుపత్రి ప్రిన్సిపాల్ డా.ఆర్‌సీ గుప్తా కూడా స్పందించారు. ఘటన సమయంలో ఇద్దరు డాక్టర్లు నిద్రిస్తున్నట్టు ఉన్న వీడియో సర్క్యూలేట్ అవుతోందని చెప్పారు. ఇందుకు సంబంధించి ఇద్దరు డ్యూటీ డాక్టర్లను సస్పెండ్ చేశామని తెలిపారు. ఘటనపై విచారణ జరుగుతోందని చెప్పారు. ఇక ఘటనపై మీరట్ జిల్లా మెజిస్ట్రేట్ కూడా దర్యాప్తు నిర్వహించనున్నారు.
ఇవి కూడా చదవండి:
పాక్ దాడుల్లో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు రాహుల్ గాంధీ ఆర్థిక సాయం
ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా ప్రధాని మోదీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి