Share News

Mansa Devi Temple Stampede: హరిద్వార్ మానసా దేవీ ఆలయం వద్ద తొక్కిసలాట.. ఆరుగురి మృతి

ABN , Publish Date - Jul 27 , 2025 | 11:13 AM

ఉత్తరాఖండ్‌లోని మానసా దేవీ ఆలయంలో ఆదివారం తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా మరో 25 మంది గాయాలపాలయ్యారు. బాధితులకు సమీప ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

Mansa Devi Temple Stampede: హరిద్వార్ మానసా దేవీ ఆలయం వద్ద తొక్కిసలాట.. ఆరుగురి మృతి
Mansa Devi temple stampede

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరాఖండ్‌ హరిద్వార్‌లోని మానసాదేవీ ఆలయంలో ఆదివారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో 25 మంది గాయాలపాలయ్యారు. ఆలయంలోకి వెళ్లే నడక దారిలో ఈ తొక్కిసలాట చోటుచేసుకుంది. దారిలో ఓ చోట ఒక్కసారిగా భక్తులు దూసుకురావడంతో రద్దీ పెరిగి కలకలానికి దారి తీసింది. కొందరు వెనక్కు తిరిగి వెళ్లే ప్రయత్నంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. కొందరు ఊపిరాడక స్పృహ తప్పి పడిపోయారు. గాయపడ్డ వారిని అంబులెన్సుల్లో స్థానిక ఆసుపత్రులకు సిబ్బంది తరలించారు. ఈలోపు దేవాలయం సిబ్బంది వెంటనే అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ విషయమై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని గర్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే మీడియాకు తెలిపారు.


హరిద్వార్‌లోని ప్రముఖ దేవాలయాల్లో మానసా దేవీ ఆలయం కూడా ఒకటి. మానసా దేవీ, చండీ దేవీ, మాయా దేవీ ఆలయాలను స్థానికులు సిద్ధ పీఠాలుగా పిలుస్తారు. హరిద్వార్‌లో గంగానదికి సమీపంలోని ఓ చిన్న కొండపై మనసా దేవీ ఆలయం ఉంది. ఈ ఆలయంలో కొలువైన నాగ దేవతను స్థానికులు సకల కోరికలను నెరవేర్చే కల్పవల్లిగా పూజిస్తారు. తమ మనోభీష్టాలు నెరవేరాలంటూ భక్తులు అక్కడ చేతికి తోరణం కట్టుకుని కోరికలు తీరాక మళ్లీ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. చేతికి కట్టుకున్న పవిత్ర తోరణాన్ని అక్కడే తీసేస్తారు. ఈ దేవాలయానికి చేరుకునేందుకు మెట్ల మార్గం, రోప్‌ వే రెండూ అందుబాటులో ఉన్నాయి. అధిక శాతం మంది రోప్ వే ద్వారా ఆలయానికి వెళుతుంటారు.


ఇవి కూడా చదవండి:

ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా ప్రధాని మోదీ

కార్గిల్ విజయ్ దివస్.. అమర వీరులకు రాష్ట్రపతి, ప్రధాని నివాళి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 27 , 2025 | 12:13 PM