Manikrao Kokate: అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రికి.. క్రీడా శాఖ బాధ్యతలు
ABN , Publish Date - Aug 01 , 2025 | 11:47 AM
అసెంబ్లీలో రమ్మీ ఆడుతూ అడ్డంగా దొరికిపోయిన మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిని క్రీడా శాఖకు బదిలీ చేస్తూ సీఎం ఫడణవీస్ ఆదేశాలు జారీ చేయడం మరో వివాదానికి దారి తీసింది. ఈ నిర్ణయంపై సెటైర్లు కూడా ఓ రేంజ్‌లో పేలుతున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: అసెంబ్లీలో మొబైల్ ఫోన్‌లో రమ్మీ ఆడుతూ అడ్డంగా దొరికిపోయిన మహారాష్ట్ర మంత్రి మాణిక్‌రావ్ కోకాటేకు (Manikrao Kokate) తాజాగా రాష్ట్ర ప్రభుత్వం క్రీడా శాఖ బాధ్యతలు అప్పగించడం మరోసారి సంచలనంగా మారింది. విమర్శలతో పాటు సెటైర్లు కూడా ఓ రేంజ్‌లో పేలుతున్నాయి.
అసెంబ్లీలో మంత్రి రమ్మీ ఆడటంపై విమర్శలు చెలరేగడంతో సీఎం ఫడణవీస్ స్పందించారు. కీలకమైన వ్యవసాయ శాఖ నుంచి ఆయనను తప్పించారు. ఇకపై మంత్రులెవరైనా తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే, వ్యవసాయ శాఖ నుంచి తప్పించాక కోకాటేకు క్రీడా శాఖ, యువత సంక్షేమ శాఖను కట్టబెట్టడంతో సెటైర్లు పేలుతున్నాయి. కోకాటే శాఖను మారుస్తూ ముఖ్యమంత్రి గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక వ్యవసాయ శాఖను మరో ఎన్సీపీ మంత్రి దత్తాత్రేయ భరణేకు అప్పగించారు. దత్తాత్రేయ ఇప్పటివరకూ నిర్వహించిన క్రీడా శాఖను కోకాటేకు ఇచ్చారు.
మంత్రి కోకాటే మొబైల్‌లో రమ్మీ ఆడుతున్న వీడియోను తొలుత ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ నెట్టింట పంచుకోవడంతో వివాదం మొదలైంది. సభా కార్యకలాపాలు జరుగుతుండగా మంత్రి రమ్మీ ఆడటంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వానాకాలంలో రైతు సమస్యలు ప్రధాన ఎజెండా జరుగుతున్న చర్చపై మంత్రి దృష్టిపెట్టకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. పాలక పక్షంపై ప్రతిపక్షం విమర్శలు గుప్పించింది. మంత్రి కోకాటే తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. మంత్రి చర్యలు బాధ్యతారహితం, అవమానకరమని మండిపడింది.
వివాదం ఇంతలా ముదిరినా కూడా మంత్రి రాజీనామా చేయలేదు. ప్రభుత్వం ఆయనకు వ్యవసాయ శాఖకు బదులు మరో శాఖ బాధ్యతలు అప్పగించింది. దీంతో, రాష్ట్ర ప్రభుత్వం కేవలం కంటితుడుపు చర్యలకు దిగిందంటూ మరోసారి ప్రతి పక్షం విరుచుకుపడుతోంది. రమ్మీని రాష్ట్ర క్రీడాగా ప్రకటించాలని ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన నేత అంబాదాస్ దాన్వే సెటైర్ పేల్చారు. అసెంబ్లీలోకి ఎమ్మెల్యేలను కార్డ్స్ తీసుకెళ్లనివ్వాలని ఎద్దేవా చేశారు.
అయితే, కోకాటే గతంలోనూ పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. రైతుల కష్టాలపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఇక రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కరువు తరహా పరిస్థితులు నెలకొన్న తరుణంలో కోకాటే తనకేమీ పట్టనట్టు ఏకంగా అసెంబ్లీలోనే రమ్మీ ఆడటంపై విమర్శలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇంత చేసినా ఆయనకు మంత్రి పదవి నిలబడటం ఏమిటని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మంచి జనాదరణ.. ఆక్యుపెన్సీ రేషియో ఎంతంటే..
ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా ప్రధాని మోదీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి