Google Maps: గూగుల్ మ్యాప్స్ ఎంత పని చేసింది.. కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవి..
ABN , Publish Date - Apr 10 , 2025 | 06:42 AM
Google Maps News: కారులో ఊరికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. వెంటనే గూగుల్ మ్యాప్స్‌లో ఊరి పేరు కొట్టాడు. దాన్ని నమ్ముకుని గుడ్డిగా వెళ్లిపోవటంతో రైలు ట్రాక్ మీదకు వచ్చి కారు ఆగింది. అదే సమయంలో ఓ రైలు అటువైపు వస్తోంది. కారు ట్రాక్ పక్కన ఉండటం గుర్తించిన లోకో పైలట్ వెంటనే ఎమర్జన్సీ బ్రేక్ వేశాడు.

Google Maps: ఒకప్పుడు ఏదైనా అడ్రస్ కనుక్కోవాలంటే తెగ ఇబ్బందిపడాల్సి వచ్చేది. రోడ్లు పట్టుకుని గంటలు, గంటలు తిరిగినా ఒక్కోసారి సరైన అడ్రస్ దొరికేది కాదు. గూగుల్ మ్యాప్స్ వచ్చిన తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది. గూగుల్ మ్యాప్స్ పుణ్యమా అని ఎవర్నీ అడుక్కోకుండానే ఏ అడ్రస్ కయినా ఇట్టే వెళ్లిపోతున్నాం. గూగుల్ మ్యాప్స్ మీద ఆధారపడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది జీవిస్తున్నారు. అయితే, గూగుల్ మ్యాప్స్ వల్ల మంచితో పాటు చెడు కూడా ఉంది. ఒక్కోసారి అది మనకు తప్పుడు అడ్రస్ చెబుతుంది. దాన్ని నమ్ముకుని గుడ్డిగా వెళ్లిపోతే ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది. గూగుల్ మ్యాప్స్ వాడి చెరువుల్లోకి, నదుల్లోకి దూసుకెళ్లిన వాహనాలు కూడా ఉన్నాయి.
తాజాగా, ఓ వ్యక్తి గూగుల్ మ్యాప్స్ కారణంగా ప్రాణాలకు తెచ్చుకున్నాడు. అతడి అదృష్టం బాగుండి బతికి బయటపడ్డాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. బీహార్ గోపాల్‌గంజ్‌కు చెందిన ఆదర్శ్ రాయ్ అనే వ్యక్తి తాజాగా ఉత్తరప్రదేశ్, గోరఖ్‌పూర్‌లో జరిగిన పార్టీకి కారులో వెళ్లాడు. అక్కడ బాగా తాగాడు. రాత్రి ఇంటికి రావడానికి గూగుల్ మ్యాప్స్ వాడాడు. తన ఊరి పేరు కొట్టాడు. అది వెళ్లవలసిన దారి చూపించింది. అతడు దాన్ని ఫాలో అవుతూ వెళ్లిపోయాడు. ఓ గంట తర్వాత రైల్వే ట్రాక్ పక్కన ఉండే రాళ్ల దగ్గరకు వచ్చి కారు ఆగిపోయింది. రైల్వే ట్రాక్‌కు అతి దగ్గరగా ఆ కారు ఉంది. అదే సమయంలో ఓ రైలు అటువైపు వస్తోంది. కారు ట్రాక్ పక్కన ఉండటం గుర్తించిన లోకో పైలట్ వెంటనే ఎమర్జన్సీ బ్రేక్ వేశాడు.
కారుకు 5 మీటర్ల దూరంలో రైలు ఆగిపోయింది. లేదంటే అతడి కారును ఢీకొట్టేది. ఆదర్శ్ రాయ్ ప్రాణాలు పోయేవి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది హుటాహుటిన కారు దగ్గరకు వచ్చారు. దాన్ని ట్రాకుకు మరింత దూరంగా తీసుకువచ్చారు. ట్రైన్ వెళ్లిపోయింది. కారు కారణంగా ఆ రైలు 57 నిమిషాలు ఆలస్యంగా వెళ్లిపోయింది. ఈ 57 నిమిషాల్లో వేరే ఏ ట్రైన్ ఆ ట్రాకుపైకి రాకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. ఇక, దీనిపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆదర్శ్ బాగా తాగటం వల్లే ఇదంతా జరిగిందని తేల్చారు. అతడు పూర్తి అడ్రస్ కాకుండా.. ఊరి పేరును మాత్రమే గూగుల్ మ్యాప్స్‌లో కొట్టడం వల్లే ఇలా అయిందని అన్నారు. ఆదర్శ్ కారును సీజ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
YCP Political Tactics: తిట్టించు ఇరికించు