Woman Forced to Drink Alcohol: దెయ్యం వదిలించే పేరుతో మహిళపై దారుణం.. ఆల్కహాల్ తాగించి..
ABN , Publish Date - Nov 08 , 2025 | 02:49 PM
కేరళలో దారుణం చోటుచేసుకుంది. దెయ్యం పట్టిందన్న పేరుతో ఓ మహిళపై మంత్రగాడు ఘాతుకానికి ఒడిగట్టాడు. ఆమెతో ఆల్కహాల్, సిగరెట్లు బలవంతంగా తాగించాడు. అంతటితో ఆగకుండా ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు.
శాస్త్ర సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందిన ఈ 21వ శతాబ్ధంలోనూ సమాజంలో మూఢనమ్మకాలు ఇంకా అలానే ఉన్నాయి. ఇందుకు కేరళలో చోటుచేసుకున్న ఈ తాజా సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. దెయ్యం పట్టిందన్న పేరుతో ఓ మహిళపై మంత్రగాడు దారుణానికి ఒడిగట్టాడు. ఆమెతో మద్యం, సిగరెట్లు బలవంతంగా తాగించాడు. అంతటితో ఆగకుండా ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కొట్టాయం జిల్లాకు చెందిన 26 ఏళ్ల అఖిల్ దాస్ భార్య గత కొద్దిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది.
ఆమె ఆరోగ్యం ఎంతకీ బాగుపడకపోవటంతో అఖిల్ దాస్ స్థానిక మంత్రగాడు శివదాస్‌ను కలిశాడు. మహిళకు దెయ్యం పట్టిందని శివదాస్ చెప్పాడు. దెయ్యం ఆమె దేహాన్ని విడిచిపోవాలంటే పూజలు చేయాలని అన్నాడు. చకచకా పూజలకు ఏర్పాట్లు జరిగాయి. బుధవారం రాత్రి పూజల సందర్భంగా మంత్రగాడు శివదాస్ మహిళతో దారుణంగా ప్రవర్తించాడు. బలవంతంగా ఆల్కహాల్, సిగరెట్లు తాగించాడు. శారీరకంగా చిత్రహింసలు పెట్టాడు. రాత్రంతా క్షుద్రపూజలు జరిగాయి. మంత్రగాడి టార్చర్ భరించలేక మహిళ స్పృహ తప్పిపడిపోయింది.
గురువారం ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం మంత్రగాడు శివదాస్‌తో పాటు మహిళ భర్త, మామను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మహిళ అత్త కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక, ఈ సంఘటనపై బాధిత మహిళ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘రాత్రి 11 గంటల సమయంలో క్షుద్రపూజలు మొదలయ్యాయి. రాత్రంతా పూజలు జరిగాయి. పూజల మధ్యలో నాతో బలవంతంగా ఆల్కహాల్ తాగించారు. సిగరెట్ల బూడిద తినిపించారు. నా శరీరంపై వాతలు సైతం పెట్టారు. నేను వారి టార్చర్ భరించలేక స్పృహ తప్పి పడిపోయాను’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
ఇవి కూడా చదవండి
బీజేపీ ఉన్నతిలో ప్రవాసీలు కీలకం..
మెక్‌డోనల్డ్స్ మేనేజర్‌పై వేడి వేడి కాఫీని విసిరేసిన కస్టమర్.. షాకింగ్ వీడియో