Karnataka: జైలు నుంచి విడుదలయ్యాక ఊరేగింపు.. కర్ణాటక అత్యాచార నిందితుల అరెస్టు
ABN , Publish Date - May 24 , 2025 | 11:13 AM
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన కర్ణాటక అత్యాచార కేసులో నిందితులను పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. బెయిల్పై విడుదలైన నిందితులు భారీ ఊరేగింపు నిర్వహించడంతో వారిని మళ్లీ అరెస్టు చేశారు.

ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటకలో సంచలనం కలిగించిన హవేరీ గ్యాంగ్ రేప్ నిందితులను పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. ఇటీవల బెయిల్పై విడుదలైన నిందితులు భారీ ఊరేగింపుగా వెళ్లడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల్లో నలుగురిని మళ్లీ అరెస్టు చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.
‘‘ఈ కేసులో ఏడుగురు నిందితులకు మే 20 బెయిల్ వచ్చింది. లిఖిహలూర్ సబ్ జైల్ నుంచి బయటకొచ్చిన నిందితులు భారీ ఊరేగింపుగా తమ స్వస్థలాలకు వెళ్లారు. పబ్లిక్ న్యూసెన్స్ సృష్టించారు. వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో కూడా పోస్టు చేశారు. ఇది మా దృష్టికి వచ్చింది.. దీంతో, హనగల్ పీఎస్లో నిందితులపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 189/2, 191/2, 281, 351/2, 351/3, 190 కింద కేసు నమోదైంది. నిందితుల్లో కొందరిని మళ్లీ అదుపులోకి తీసుకున్నాము. వారిని కోర్టు ముందు హాజరు పరుస్తాము. వారి బెయిల్ రద్దు కోసం కూడా దరఖాస్తు చేసుకుంటాము’’ అని హవేరీ ఎస్పీ అన్షూ కుమార్ పేర్కొన్నారు.
హంగల్ తాలూకాలో గతేడాది జనవరి 8న జరిగిన ఈ సామూహిక అత్యాచార ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. బాధితురాలు మరో స్నేహితుడితో ఓ హోటల్ గదిలో ఉండగా కొందరు ఆమెను సమీపంలోని అడవిలోకి ఈడ్చికెళ్లి దారుణానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మొత్తం 19 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో ఏడుగురు నిందితులకు సుమారు 17 నెలల పాటు జైల్లో ఉన్నాక మే 20న బెయిల్ లభించింది. ఈ క్రమంలో జైలు నుంచి బయటకొచ్చిన నిందితులు భారీ ఊరేగింపు నిర్వహించారు. విజయోత్సాహం ప్రదర్శిస్తున్నట్టు వీ ఆకారంలో వేళ్లను ప్రదర్శించారు. ఫలితంగా అక్కడ ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడింది.
సోషల్ మీడియాలో ఈ అంశంపై తీవ్ర దుమారం రేగింది. జనాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో తప్పుడు సంకేతాలు వెళతాయని కామెంట్ చేశారు. ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి:
సాటి సైనికుడిని కాపాడే క్రమంలో ఆర్మీ ఆఫీసర్ మృతి
ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతూ ఎంపీ శశి థరూర్ లేఖ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి