Pankaj Dheer: మహాభారత్ కర్ణుడు పంకజ్ ధీర్ కన్నుమూత
ABN , Publish Date - Oct 15 , 2025 | 03:30 PM
పంజాబ్‌కు చెందిన పంకజ్ ధీర్ 1980లో సినీ కెరీర్ ప్రారంభించి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. బీఆర్ చోప్రా 'మహాభారత్' టీవీ సీరియల్‌లో కర్ణుడి పాత్ర పోషించడంతో ఆయన పాపులారిటీ ఒక్కసారిగా పెరిగింది.
ముంబై: బీఆర్ చోప్రా టీవీ సిరీస్ 'మహాభారత్' (Maha Bharat)లో కర్ణుడి (Karna) పాత్ర పోషించిన ప్రముఖ నటుడు, టీవీ స్టార్ పంకజ్ ధీర్ (Pankaj Dheer) కన్నుమూశారు. ఆయన వయస్సు 68 సంవత్సరాలు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన కొన్ని నెలలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఉదయం ఆయన తుది శ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ముంబైలోని పవన్ హన్స్ క్రిమిటోరియంలో సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు జరుగనున్నాయి.

పంజాబ్‌కు చెందిన పంకజ్ ధీర్ 1980లో సినీ కెరీర్ ప్రారంభించి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. బీఆర్ చోప్రా 'మహాభారత్' టీవీ సీరియల్‌లో కర్ణుడి పాత్ర పోషించడంతో ఆయన పాపులారిటీ ఒక్కసారిగా పెరిగింది. ఆ తర్వాత కూడా చంద్రకాంత, జీ హారర్ షో, కానూన్, ససురాల్ సిమర్ కా వంటి టీవీ సీరియల్స్‌లోనూ, సోల్జర్, అందాజ్, బాద్సా, తుమ్కో న భూల్ పాయేంగే వంటి చిత్రాల్లో నటించారు.
పంకజ్ ధీర్ కుమారుడు నికితిన్ ధీర్ కూడా నటుడే. చెన్నై ఎక్స్‌ప్రెస్, జోథా అక్బర్, సూర్యవంశి తదితర చిత్రాల్లో ఆయన నటించారు. పంకజ్ ధీర్ తండ్రి సీఎల్ ధీర్ సైతం ఫిల్మ్‌మేకర్‌గా పేరు తెచ్చుకున్నారు. బహు బేటి, జిందగీ వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. కాగా, పంకజ్ ధీర్ నటనతోపాటు ముంబైలో తన సోదరుడు సట్లజ్ ధీర్‌తో కలిసి ఒక షూటింగ్ స్టూడియోకు సహ వ్యవస్థాపకుడుగా వ్యవహరించారు. 2010లో ఔత్సాహిక నటుల కోసం అభినయ్ యాక్టింగ్ అకాడమీని కూడా స్థాపించారు. పంకజ్ మృతి పట్ల పలువురు సినీ, టీవీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్.. 27 మంది లొంగుబాటు
బెదిరింపులు నాకేం కొత్త కాదులే.. ఆర్‌ఎస్‌ఎస్‌పై ఇక పోరాటమే..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి