Jharkhand Hospital Inspection: ఆసుపత్రిలో మంత్రి తనయుడి తనిఖీలు వివాదాస్పదం.. ఝార్ఖండ్‌లో ఘటన
ABN , Publish Date - Jul 20 , 2025 | 10:09 PM
ఝార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి తనయుడు రాంచీలోని ఓ ఆసుపత్రిని సందర్శించడం వివాదాస్పదంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఏ అధికారంతో మంత్రి తనయుడు ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహిస్తున్నాడంటూ దుయ్యబట్టాయి.

ఇంటర్నెట్ డెస్క్: ఝార్ఖండ్ ఆరోగ్య శాఖా మంత్రి ఇర్ఫాన్ అన్సారీ తనయుడు రాంచీలోని ఓ ఆసుపత్రిని తన స్నేహితులతో కలిసి సందర్శించడం వివాదానికి దారి తీసింది. అక్కడ సేవలు సరిగా ఉన్నాయా అంటూ రోగులను ప్రశ్నించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రిలో మంత్రి తనయుడు తనిఖీలు నిర్వహిస్తున్నారా అంటూ ప్రతిపక్షాలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి.
మంత్రి తనయుడు క్రిష్ అన్సారీ ఇన్‌స్టా హ్యాండిల్ ఈ వీడియో కనిపించింది. ఈ వీడియోలో అతడు తన స్నేహితులతో కలిసి ఆసుపత్రి గదుల్లో తనిఖీ నిర్వహించాడు. ‘మీకేమైనా ఇక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయా? ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ వివరాలు షేర్ చేయండి’ అని అడగడం కనిపించింది.
‘ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి, మంత్రిగారి పెద్ద కుమారుడు వచ్చారు’ అని అతడి స్నేహితుడు సూచించడం కూడా వీడియోలో రికార్డయ్యింది.
ఈ వీడియో వైరల్ కావడంతో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు అగ్గిమీద గుగ్గిలమయ్యాయి. ఏ హోదాతో మంత్రి తనయుడు ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించాడంటూ నిలదీశాయి. మౌలిక వసతులపై దృష్టి సారించకుండా రీల్స్ రికార్డు చేయడంలో మంత్రి తనయుడు బిజీగా కనిపించాడని బీజేపీ అధికార ప్రతినిధి అజయ్ షా విమర్శలు గుప్పించారు. ‘ఇక ఆరోగ్య మంత్రుల తనయులు కూడా ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తారా? మరి ఆర్థిక మంత్రుల బిడ్డలు ప్రభుత్వ ఫైళ్లను సమీక్షిస్తారా?’ అని అన్నారు.
తప్పు చేసిన తనయుడికి మంచి చెప్పకుండా సదరు మంత్రి అతడిని వెనకేసుకొచ్చేందుకు ప్రయత్నించారని కూడా బీజేపీ ప్రతినిధి షా మండిపడ్డారు. దీంతో, ఆయన అనుమతితోనే ఇదంతా జరిగిందన్న భావన కలుగుతోందని వ్యాఖ్యానించారు. మంత్రి అన్సారీ రాహుల్ గాంధీ అడుగుజాడల్లోనే నడుస్తున్నట్టు ఉందని, కుటుంబం మొత్తాన్ని రాజకీయాల్లో సెటిల్ చేయాలని చూస్తున్నట్టు ఉందని అన్నారు.
ఇక తన తనయుడిపై వస్తున్న విమర్శలపై మంత్రి అన్సారీ ఓ ప్రకటన విడుదల చేశారు. రాజకీయ లక్ష్యాలతో చేస్తున్న ఈ విమర్శలు నిరాధారం, అర్థరహితమని తేల్చి చెప్పారు. అనవసరంగా తన తనయుడిని ఈ వివాదంలోకి లాగారని అన్నారు. తన టీచర్ తండ్రి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే పరామర్శించేందుకు వెళ్లారని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
కామిక్స్ పుస్తకాల్లో కొకైన్ స్మగ్లింగ్.. బెంగళూరు ఎయిర్‌పోర్టులో నిందితుడి అరెస్టు
మోదీ జీ సమాధానం చెప్పండి.. ట్రంప్ కామెంట్స్‌పై రాహుల్ గాంధీ స్పందన
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి