Share News

Prajwal Revanna: ప్రజ్వల్‌ రేవణ్ణకు యావజ్జీవం

ABN , Publish Date - Aug 03 , 2025 | 05:48 AM

ప్రధాని దేవెగౌడ మనవడు, జేడీఎస్‌ మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు(34) బెంగళూరులోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

Prajwal Revanna: ప్రజ్వల్‌ రేవణ్ణకు యావజ్జీవం

  • పనిమనిషిపై అత్యాచారం కేసులో శిక్ష

  • రూ.10 లక్షల జరిమానా కూడా..

  • అందులో 7 లక్షలు బాధితురాలికి

  • తీర్పు వెల్లడించిన ప్రజాప్రతినిధుల కోర్టు

  • కోర్టులో వెక్కివెక్కి ఏడ్చిన ప్రజ్వల్‌ రేవణ్ణ

బెంగళూరు, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, జేడీఎస్‌ మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు(34) బెంగళూరులోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. పనిమనిషిపై అత్యాచారం కేసులో నేరం రుజువైనట్లు కోర్టు శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. న్యాయాధికారి సంతో్‌శ్‌ గజానన భట్‌ శనివారం శిక్షను ఖరారు చేశారు. వివిధ సెక్షన్‌ల కింద శిక్ష వేయడంతోపాటు రూ.10 లక్షల జరిమానా కూడా విధించారు. జరిమానాలో రూ.7 లక్షలను బాధితురాలికి(పని మనిషి) ఇవ్వాలని ఆదేశించారు. కర్ణాటక రాజకీయాల్లో దేవెగౌడ కుటుంబానికి ఎంతో పేరుంది. ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, ప్రధాన మంత్రిగా సేవలు అందించిన దేవెగౌడ, ప్రస్తుతం 92 ఏళ్ల వయసులోనూ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. దేవెగౌడ మరో కుమారుడు కుమారస్వామి కేంద్రమంత్రిగా ఉన్నారు. రెండో కుమారుడు రేవణ్ణ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రజ్వల్‌ తమ్ముడు సూరజ్‌ ఎమ్మెల్సీగా ఉన్నారు.


ఎన్నికల సమయంలో..

2024 లోక్‌సభ ఎన్నికలలో ప్రజ్వల్‌ రేవణ్ణ రెండోసారి జేడీఎస్‌ తరఫున హసన్‌ స్థానం నుంచి పోటీ చేశారు. ప్రజ్వల్‌ లైంగిక దౌర్జన్యానికి పాల్పడుతుండగా తీసిన వీడియోలు, ఫొటోలు ఉన్న పెన్‌డ్రైవ్‌లు సరిగ్గా పోలింగ్‌కు ( ఆ ఏడాది ఏప్రిల్‌) రెండు రోజుల ముందు బయటకు వచ్చాయి. ఆ వీడియోల్లో 48 ఏళ్ల వయసున్న ప్రజ్వల్‌ పనిమనిషికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు కూడా ఉన్నాయి. ప్రజ్వల్‌ లైంగిక దాడి చేస్తూ స్వయంగా వీడియోలు చిత్రీకరించుకున్నారు. ఇవి వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. బాధితురాలు (పనిమనిషి) పోలీసులను ఆశ్రయించారు. ఈ వివాదం నేపథ్యంలో పోలింగ్‌ జరిగిన రోజు రాత్రే ప్రజ్వల్‌ యూరప్‌ దేశాలకు వెళ్లారు. మే 31న ఆయన బెంగళూరుకు తిరిగిరాగా, ఎయిర్‌పోర్టులోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేసిన సిట్‌ అధికారులు ప్రజాప్రతినిధుల కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. ఈ నెల ఒకటో తేదీ, శుక్రవారం, అత్యాచారం కేసులో ప్రజ్వల్‌ నేరం రుజువైందని న్యాయస్థానం ప్రకటించింది.


కోర్టులోనే గట్టిగా ఏడ్చేసిన ప్రజ్వల్‌

కోర్టు కార్యకలాపాలు శనివారం ఉదయం ప్రారంభం కాగానే, ‘చివరిగా చెప్పుకొనేది ఏమైనా ఉందా..?’ అని ప్రజ్వల్‌ను న్యాయాధికారి ప్రశ్నించారు. దీంతో ప్రజ్వల్‌ కన్నీరు పెట్టుకున్నారు. ఒక దశలో గట్టిగా ఏడ్చారు. రాజకీయాల్లో వేగంగా ఎదగడమే తాను చేసిన తప్పు అని రోదించారు. న్యాయాధికారి సంతోశ్‌ గజానన భట్‌ సాయంత్రం 4 గంటల తర్వాత తీర్పు ప్రకటించారు. కాగా, పనిమనిషి(బాధితురాలు) కిడ్నాప్‌ కేసులో ప్రజ్వల్‌ తండ్రి రేవణ్ణ కూడా అరెస్టు అయి, ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.

Updated Date - Aug 03 , 2025 | 05:56 AM