CM Omar Abdullah: మృతదేహాలను చూపి రాష్ట్ర హోదా డిమాండ్ చేయను
ABN , Publish Date - Apr 29 , 2025 | 05:30 AM
పహల్గాములో జరిగిన ఉగ్ర దాడిపై జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్ధుల్లా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఓదార్చడానికి తన వద్ద మాటలు లేవని, దాడిని రాజకీయం చేయాలనుకోలేదని అన్నారు.

పర్యాటకుల భద్రతకు నాదే బాధ్యత
క్షమాపణ చెప్పడానికి కూడా నా వద్ద మాటల్లేవు
జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో సీఎం ఒమర్
శ్రీనగర్, ఏప్రిల్ 28: పహల్గాం ఉగ్ర దాడిని రాజకీయం చేయదలచుకోలేదని, అమాయకుల మృతదేహాలను చూపి రాష్ట్ర హోదాను డిమాండ్ చేయాలనుకోవడం లేదని జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్ధుల్లా వ్యాఖ్యానించారు. ఉగ్ర దాడిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో సోమవారం ఆయన మాట్లాడారు. ‘‘కొద్ది రోజుల కిందటే పెళ్లి చేసుకున్న నేవీ అధికారి భార్యను నేనెలా ఓదార్చగలను? మేం చేసిన నేరం ఏమిటని బాధితుల కుటుంబాలు అడుగుతున్నాయి. అందుకు నా దగ్గర జవాబు లేదు. జమ్ము కశ్మీరులో శాంతి భద్రతలకు మేం ఇన్‌చార్జి కాదు. కశ్మీరుకు పర్యాటకులను ఆహ్వానించాం. వారి భద్రతకు నాదే బాధ్యత. కానీ, పర్యాటకులకు క్షమాపణ చెప్పడానికి కూడా నా దగ్గర మాటల్లేవు. అయినా, ప్రస్తుత పరిస్థితిని రాష్ట్ర హోదా డిమాండ్ చేయడానికి ఉపయోగించుకోదలచుకోవడం లేదు. మృతదేహాలను చూపి రాష్ట్ర హోదాను డిమాండ్ చేయను. అంత నీచ మనస్తత్వం నాది కాదు. దానిని మరో సందర్భంలో డిమాండ్ చేస్తాం’’ అని వ్యాఖ్యానించారు.
ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండిస్తూనే మృతుల పేర్లను అసెంబ్లీలో చదివి వినిపించారు. పర్యాటకుల భద్రత తమ బాధ్యతని, కానీ ఈ దాడి తమను చేష్టలుడిగేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, ‘‘ఇంత విషాదంలోనూ ఓ ఆశా కిరణం ఉంది. ఇటువంటి దాడికి వ్యతిరేకంగా గత 26 ఏళ్లలో ఎవరూ బయటకు వచ్చి నిరసనలు తెలిపిన దాఖలాలు లేవు. స్వచ్ఛందంగా పోస్టర్లు, బ్యానర్లు పట్టుకుని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కశ్మీరువ్యాప్తంగా మసీదుల్లో నివాళులర్పించారు. ఇది చాలా కీలక పరిణామం. ప్రజలు సహకరిస్తే ఉగ్రవాదం అంతమవుతుంది. ఇది దానికి ఆరంభం మాత్రమే’’ అని ఆయన వ్యాఖ్యానించారు. తుపాకులతో ఉగ్రవాదాన్ని నియంత్రించగలమని, కానీ, ప్రజలు సహకరించినప్పుడే అది అంతమవుతుందని చెప్పారు.c
ఇవి కూడా చదవండి..
PM Modi: ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 40 నిమిషాల భేటీ..ఏం చర్చించారంటే..
Pahalgam Terror Attack: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఉగ్ర దాడిపై స్పందించిన సీఎం
For National News And Telugu News