Share News

Jaipur Student Suicide: నాల్గవ తరగతి బాలిక ఆత్మహత్య కేసు.. సీబీఎస్‌ఈ దర్యాప్తులో కీలక విషయాలు

ABN , Publish Date - Nov 21 , 2025 | 12:18 PM

జైపూర్‌లో నాల్గవ తరగతి బాలిక ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఘటన జరిగిన రోజు బాలిక తోటి విద్యార్థుల వేధింపులు తాళలేక సుమారు 45 నిమిషాల పాటు టీచర్ సాయాన్ని అర్థించినట్టు సీబీఎస్‌ఈ నివేదికలో తేలింది. పాఠశాలలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన అనంతరం సీబీఎస్‌ఈ ఈ నిర్ధారణకు వచ్చింది.

Jaipur Student Suicide: నాల్గవ తరగతి బాలిక ఆత్మహత్య కేసు.. సీబీఎస్‌ఈ దర్యాప్తులో కీలక విషయాలు
Jaipur Class 4 suicide

ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్‌లోని జైపూర్‌లో నాల్గవ తరగతి బాలిక ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తోటి విద్యార్థుల వేధింపులు తాళలేక బాలిక దాదాపు 45 నిమిషాల పాటు సాయం కోసం టీచర్‌ను అర్థించినట్టు సీబీఎస్‌ఈ అధికారులు నిర్ధారణకు వచ్చారు. అప్పుడే టీచర్ జోక్యం చేసుకుని ఉంటే పరిస్థితి ఇంతలా దిగజారేది కాదని సీబీఎస్ఈ దర్యాప్తులో తేలింది. నవంబర్ 1న అమైరా అనే బాలిక తన స్కూలు నాల్గవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై సీబీఎస్‌ఈ దర్యాప్తు ప్రారంభించింది (Jaipur 4th class Suicide Case).

సీబీఎస్‌ఈ నివేదిక ప్రకారం, ఘటనకు ముందు 18 నెలలుగా బాలిక తన క్లాస్‌మేట్స్ చేతిలో వేధింపులకు గురైంది. ఘటన జరిగిన రోజు తొలుత బాలిక ఉత్సాహంగానే కనిపించింది. అయితే, ఉదయం 11 గంటల తరువాత పరిస్థితి మారింది. క్లాస్‌లో చదివే కొందరు అబ్బాయిలు డిజిటల్ స్లేట్‌పై ఏదో రాయడంతో ఆమె ఇబ్బంది పడింది. తనతో తప్పుగా మాట్లాడుతున్నారని టీచర్‌కు ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో టీచర్ సాయం కోసం ఆమె 45 నిమిషాల పాటు అభ్యర్థించినా ఫలితం లేకపోయింది. పైపెచ్చు టీచర్ బాలికపై క్లాస్ అంతా ఆశ్చర్యపోయేలా అరిచింది. ఆ రోజు మధ్యాహ్నం కూడా భోజనం చేయని అమైరా ఆ తరువాత బలవన్మరణానికి పాల్పడింది. క్లాస్‌లో ఉన్న టీచర్‌ పునీతా శర్మ సమయానుకూలంగా స్పందించకపోవడం వల్లే ఇలా జరిగిందని సీబీఎస్‌ఈ తన నివేదికలో పేర్కొంది.


అమైరాకు అంతకుముందు క్లాస్‌లో చాలా సార్లు తోటి విద్యార్థుల నుంచి వేధింపులు ఎదురైనా స్కూల్ యాజమాన్యం ఆ విషయాన్ని నిర్లక్ష్యం చేసింది. క్లాస్‌లో ఓ అబ్బాయి అమైరాను ఏడిపిస్తున్నాడని బాలిక తండ్రి సెప్టెంబర్‌లో ఓసారి ఫిర్యాదు చేశారు. అమైరా తనతో ఐలవ్ యూ చెప్పినట్టు బాలుడు ఆ తరువాత మరో సందర్భంలోనూ పొరబడ్డాడు. ఈ విషయమై బాలుడి తల్లికి అమైరా తల్లి ఫిర్యాదు కూడా చేసింది. ఆమె తన కొడుకును మందలించింది. అమైరాకు క్షమాపణలు కూడా చెప్పింది.

ఇక గతేడాది మే నెలలోనూ ఓ బాలుడు అమైరాను ఇబ్బంది పెడితే తల్లి ఫిర్యాదు చేసింది. కానీ స్కూల్ యాజమాన్యం ఈ విషయంలో తగిన విధంగా స్పందించలేదని సీబీఎస్‌ఈ తన నివేదికలో పేర్కొంది. టీచర్ పునీతా శర్మకు, స్కూల్ యాజమాన్యానికి బాలిక వేధింపులు ఎదుర్కొంటున్న విషయం తెలుసని సీబీఎస్‌ఈ నివేదికలో పేర్కొన్నారు. ఘటన రోజున స్కూల్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజీని సీబీఎస్‌ఈ క్షుణ్ణంగా పరిశీలించింది.


ఇవి కూడా చదవండి...

పెళ్లిలో వధువు మైమరిచిపోయి డ్యాన్స్.. మరుసటి రోజు ఆమె చేసిన పనికి..

అమ్మో.. బెంగళూరు ట్రాఫిక్.. వ్యోమగామి శుభాన్షూ శుక్లా సెటైర్లు

Read Latest National News And Telugu News

Updated Date - Nov 21 , 2025 | 04:00 PM