Indias Heaviest Communication Satellite: ఇస్రో భారీ ప్రయోగం
ABN , Publish Date - Nov 02 , 2025 | 04:06 AM
భారీ ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. 4,410కిలోల అత్యంత బరువైన సీఎమ్‌ఎస్-3 (సమాచార) ఉపగ్రహాన్ని ఆదివారం కక్ష్యలోకి చేర్చనుంది...
4,410 కిలోల అత్యంత బరువైన సీఎమ్‌ఎస్-3 ఉపగ్రహం నేడు కక్ష్యలోకి..
సూళ్లూరుపేట/తిరుమల, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): భారీ ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. 4,410కిలోల అత్యంత బరువైన సీఎమ్‌ఎస్-3 (సమాచార) ఉపగ్రహాన్ని ఆదివారం కక్ష్యలోకి చేర్చనుంది. భారత భూభాగం నుంచి గతంలో ఎన్నడూ ఇంత బరువైన ఉపగ్రహాన్ని పంపిన చరిత్ర లేదు. దీంతో ‘బాహుబలి’గా పిలిచే అత్యంత శక్తివంతమైన రాకెట్ ఎల్‌వీఎమ్ 3-ఎమ్ 5ను ఇస్రో సిద్ధం చేసింది. ఉపగ్రహాన్ని ‘బాహుబలి’ ద్వారా కక్ష్యలోకి చేర్చే మిషన్ ఆదివారం సాయంత్రం 5.26 గంటలకు మొదలవుతుంది. రాకెట్ భూమి నుంచి నింగిలోకి ఎగిరిన 16.09 నిమిషాలకు జియో ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి (జీటీవో) ఉపగ్రహాన్ని ప్రవేశపెడుతుంది. మూడు దశల్లో ఇది సాగుతుంది. సైనిక సమాచార అవసరాల కోసం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీనిని రూపొందించారు. ఈ ప్రక్రియ కు సంబంధించిన కౌంట్‌డౌన్ తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) రెండో ప్రయోగ వేదిక వద్ద శనివారం సాయంత్రం 5.26 గంటలకు మొదలైంది. 24 గంటలపాటు ఇది కొనసాగుతుంది. రాకెట్‌కు ఇంధనాన్ని నింపే ప్రక్రియను ఇప్పటికే పూర్తిచేసిన శాస్త్రవేత్తలు, అన్ని భాగాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇస్రో చైర్మన్ వి.నారాయణన్, షార్ డైరెక్టర్ ఈఎస్ పద్మకుమార్ కౌంట్‌డౌన్ ప్రక్రియను పరిశీలించారు. లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్) శనివారం మరోసారి సమావేశమై, ఈ ప్రయోగానికి తన ఆమోదం తెలిపింది.
తిరుమల, చెంగాళమ్మ ఆలయాల్లో పూజలు
ఎల్‌వీఎమ్ 3-ఎమ్ 5 ప్రయోగం భారత సమాచార రంగంలో కీలక ఘట్టంగా నిలవనున్నదని ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ తెలిపారు. శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన, ఉపగ్రహ నమూనాను శ్రీవారి పాదాల వద్ద ఉంచి పూజలు జరిపించారు. అనంతరం సూళ్లరుపేటలోని చెంగాళమ్మ అమ్మవారి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు చేశారు.
బాహుబలి.. విశేషాలు..
‘బాహుబలి’ ఎత్తు 43.5 మీటర్లు. ఇది 4,000 కిలోల వరకు ఉన్న ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ వరకు (జీటీవో), 8,000 కిలోల వరకు ఉన్న ఉపగ్రహాన్ని లో ఎర్త్ ఆర్బిట్ వరకు (ఎల్‌ఈవో) మోసుకుపోగలదు. ‘బాహుబలి’ ద్వారా అమలుచేసి న అతిపెద్ద మిషన్లలో ఇది ఐదోవది కానుంది. ప్రతిష్ఠాత్మకమైన చంద్రయాన్-3 మిషన్ ఇందులో ఒకటి. నిజానికి, బాగా బరువైన ఉపగ్రహాన్ని ఇస్రో గతంలోనూ కక్ష్యలోకి చేర్చింది. అయితే, వాటిని భారత భూభాగం నుంచి కాకుండా.. విదేశాల నుంచి చేపట్టింది. ఇస్రో 2018లో ఫ్రెంచి గయానానుంచి 5,854 కిలోల బరువు ఉన్న జీశాట్-11 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చింది. కాగా, సీఎమ్‌ఎస్-3 అనేది బహుళ సమాచార ఉపగ్రహం. భారత డిజిటల్, బ్రాడ్‌కాస్ట్ వ్యవస్థల సామర్థాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన ఈ శాటిలైట్‌ను భూమిమీదా, సముద్రంలోనూ సేవలు అందించేలా సిద్ధంచేశారు. సమాచార సేవలను విస్తరిస్తూ, విపత్తు నిర్వహణ వ్యవస్థలకు మద్దతుగా భారత భూభాగంతోపాటు సమీప సముద్ర ప్రాంతాల్లోని పరిస్థితిని కూడా ఇది విశ్లేషించగలదు.