IndusInd Bank crisis: ఇండస్‌ఇండ్ బ్యాంక్ సంక్షోభంలో మరో మలుపు
ABN , Publish Date - May 30 , 2025 | 07:33 AM
ప్రజల సొమ్ములకు బ్యాంకులసలెంతవరకూ నిఖార్సు?. రూపాయి చొప్పున దాచుకుని బ్యాంకుల్లో సేవ్ చేసుకునే చిన్నా, చితకా ఖాతాదారుల డబ్బు ఏ మేరకు పదిలం? ఈ విషయాలు సామాన్య ప్రజల్ని ఆలోచనలో పడేసే రోజులివి.

ఇంటర్నెట్ డెస్క్: ప్రజల సొమ్ములకు బ్యాంకులు అసలెంతవరకూ నిఖార్సు?. రూపాయి చొప్పున దాచుకుని బ్యాంకుల్లో సేవ్ చేసుకునే చిన్నా, చితకా ఖాతాదారుల డబ్బు ఏ మేరకు పదిలం? అనే విషయాలు సామాన్య ప్రజల్ని ఆలోచనలో పడేసే రోజులివి. చరిత్రలో వీటికి సంబంధించి ఎన్నో దుష్టాంతాలు ఉన్నాకాని, ప్రజలు ఇంకా బ్యాంకుల మీద నమ్మకం ఉంచి పొదుపు చేస్తున్నారు. మన బ్యాంకింగ్ వ్యవస్థ సురక్షితంగానే ఉందంటూ ఆర్‌బీఐ ఊరటనిచ్చే మాటలు ఎప్పటికప్పుడు చెబుతూ ఉన్నప్పటికీ బయటపడుతున్న అవకతవకలు చెంపపెట్టులా ఉంటున్నాయి. తాజాగా మరో బ్యాంకు వ్యవహారం ఖాతాదారులు, పెట్టుబడిదారుల్లో మానసిక ఆందోళనకు కారణమౌతోంది.
దేశంలోనే ఐదవ పెద్ద ప్రయివేటు రంగ బ్యాంకు ఇండస్ఇండ్ బ్యాంక్. మూడు దశాబ్దాల చరిత్ర గల హిందూజా గ్రూప్‌నకు చెందిన ఈ బ్యాంకు ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లోకి వస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో అకౌంటింగ్ లోపాలు, మైక్రోఫైనాన్స్ పోర్ట్‌ఫోలియోలో మోసం, బ్యాలెన్స్ షీట్ బహిర్గతం వంటి వ్యవహారాలు ఇండస్‌ఇండ్ బ్యాంకు ఎదుర్కొంటోంది. ఫలితంగా అంతర్గత ఆడిట్ సమీక్ష, ఉన్నత స్థాయి రాజీనామాలు, ఫోరెన్సిక్స్ దర్యాప్తు జరిగింది. ఇలా ఉంటే, తాజాగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) 2023-24, 2024-25 సంవత్సరాలకు ఇండస్ఇండ్ బ్యాంక్ ఆర్థిక నివేదికలను సమీక్షించబోతున్నట్టు సమాచారం. ఇన్స్టిట్యూట్ యొక్క ఫైనాన్షియల్ రిపోర్టింగ్ రివ్యూ బోర్డు (FRRB) ఈ సమీక్షను నిర్వహిస్తుంది.
"ICAI యొక్క FRRB 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాలకు ఇండస్ఇండ్ బ్యాంక్ లిమిటెడ్ ఆర్థిక , చట్టబద్ధమైన ఆడిటర్ నివేదికలను సమీక్షిస్తుందని ఈరోజు జరిగిన FRRB బోర్డు సమావేశంలో నిర్ణయించబడింది" అని ICAI అధ్యక్షుడు చరణ్‌జోత్ సింగ్ నందా నిన్న (గురువారం) చెప్పారు. అకౌంటింగ్, ఆడిటింగ్ ప్రమాణాలు.. కంపెనీల చట్టం 2013 యొక్క షెడ్యూల్ II, III, మొదలైన వాటికి అనుగుణంగా ఉన్నాయో లేదో అంచనా వేయడానికి FRRB కంపెనీ ఆర్థిక నివేదికలను సమీక్షిస్తుంది. కంపెనీ అకౌంటింగ్, ఆడిటింగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నాయో లేవో చూడ్డం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేసిన మాస్టర్ సర్క్యులర్‌లు/నిర్దేశాలకు అనుగుణంగా నడుచుకుంటుందో లేదో FRRB అంచనా వేయబోతోంది. దీంతోనైనా ఇండస్‌ఇండ్ బ్యాంక్ కథ ఖాతాదార్లకు ఊపిరితీసుకునేలా ఉంటుందో లేదో చూడాలి.
ఇవీ చదవండి:
భారత్ కంటే వెనకబడ్డ జపాన్.. అసలు ఆ దేశంలో ఏం జరుగుతోందో తెలిస్తే..
నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి