Share News

మన టైమ్‌ వచ్చింది

ABN , Publish Date - Jun 19 , 2025 | 03:48 AM

ఏడు ఉపగ్రహాలతో దేశీయ నావిక్‌ను అభివృద్ధి చేసింది. ఈ ఏడు ఉపగ్రహాల్లో ఒక్కో దాంట్లో మూడు పరమాణు గడియారాలు ఉంటాయి

మన టైమ్‌ వచ్చింది

న్యూఢిల్లీ, జూన్‌ 18: ‘టైమెంత?’ అని ఎవరైనా అడిగితే యథాలాపంగా చెప్పేస్తాంగానీ.. సమయ నిర్ణయం వెనుక పెద్ద ఎత్తున ఉపగ్రహ వ్యవస్థలు, పరమాణు గడియారాల వంటివి ఉంటాయని చాలా మందికి తెలియదు! అలా మనం ఇప్పటిదాకా సమయ నిర్ధారణకు, నిర్వహణకు.. గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ (జీపీఎస్‌) వంటి విదేశీ వ్యవస్థలపైనే ఆధారపడుతున్నాం. కానీ.. ఇప్పుడు మన ‘టైమ్‌’ వచ్చేసింది! ఇకపై దేశంలో నిర్వహించే అన్ని రకాల న్యాయ, వాణిజ్య, డిజిటల్‌, పరిపాలనా కార్యకలాపాలకూ తప్పనిసరిగా... మన ‘నావిక్‌’ ఉపగ్రహ వ్యవస్థతో అనుసంధానమైన భారత ప్రామాణిక సమయాన్నే (ఐఎ్‌సటీ) పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘ఒక దేశం-ఒకే సమయం’ పేరిట అమలు చేయనున్న ఈ విధానానికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే నోటిఫై చేయనున్నట్టు కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి వెల్లడించారు. ‘‘ప్రస్తుతం దేశంలో చాలా వ్యవస్థలు జీపీఎస్‌ వంటి విదేశీ సమయ వ్యవస్థలపై ఆధారపడి పనిచేస్తున్నాయి. దీనివల్ల సైబర్‌ దాడులు జరిగే ప్రమాదం ఉంది’’ అని ఆయన ఆందోళన వెలిబుచ్చారు.


ఇదీ నేపథ్యం..

కార్గిల్‌ యుద్ధ సమయంలో మన సైన్యం జీపీఎస్‌పై ఆధారపడడం, అది సరిగ్గా ఉపయోగపడకపోవడంతో.. దేశీయ ఉపగ్రహ వ్యవస్థల ప్రాముఖ్యాన్ని భారత ప్రభుత్వం గుర్తించింది. నేవిగేషన్‌కు మాత్రమే కాదు.. బ్యాంకింగ్‌ కార్యకలాపాలకు, శాస్త్ర పరిశోధనలకు, అంతరిక్ష ప్రయోగాలకు ఇలా అన్నింటికీ సమయ కచ్చితత్వం కీలకం. అందుకే మన ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించి.. ఏడు ఉపగ్రహాలతో దేశీయ నావిక్‌ను అభివృద్ధి చేసింది. ఈ ఏడు ఉపగ్రహాల్లో ఒక్కో దాంట్లో మూడు పరమాణు గడియారాలు ఉంటాయి. ఈ ఉపగ్రహాలు.. దేశంలోని ఐదు ‘రీజనల్‌ రిఫరెన్స్‌ స్టాండర్డ్‌ లాబొరేటరీ్‌స’కు అనుసంధానమై ఉంటాయి. అహ్మదాబాద్‌, బెంగళూరు, భువనేశ్వర్‌, ఫరీదాబాద్‌, గువాహటి నగరాల్లోని ఆ 5ల్యాబుల్లోనూ పరమాణు గడియారాలు ఉంటాయి. వాటిలో.. ఫరీదాబాద్‌ ల్యాబ్‌ నావిక్‌ ఉపగ్రహాల్లోని పరమాణు గడియారాల నుంచి వచ్చిన టైమ్‌ సిగ్నల్స్‌ను స్వీకరించి.. వాటిని ఆప్టికల్‌ ఫైబర్‌ లింక్స్‌ ద్వారా మిగతా నాలుగు కేంద్రాలకూ పంపుతుంది. ఇలా ఆ ఐదు కేంద్రాలూ మైక్రో సెకన్లతో సహా కచ్చితమైన సమయాన్ని దేశానికి అందిస్తాయి.

Updated Date - Jun 19 , 2025 | 03:48 AM