NHRC-Sleeper Bus Accidents: స్లీపర్ బస్సులతో యాక్సిడెంట్స్.. రాష్ట్రాలన్నిటికీ ఎన్‌హెచ్‌ఆర్‌సీ కీలక సూచనలు
ABN , Publish Date - Nov 29 , 2025 | 11:56 AM
స్లీపర్ బస్సులతో ఇటీవల కాలంలో పలు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. నిబంధనలకు అనుగుణంగా లేని బస్సులను వెంటనే పక్కనపెట్టేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల స్లీపర్ బస్సుల కారణంగా జరిగిన పలు రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ రంగంలోకి దిగింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న స్లీపర్ బస్సులను తక్షణం పక్కనపెట్టేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేసింది (NHRC-Sleeper Bus Accidents).
ఎన్‌హెచ్‌ఆర్‌సీ మార్గదర్శకాల ప్రకారం..
ఏఐఎస్:052, ఏఐఎస్:119 నిబంధనల మేరకు వాహనాలు ఉండేలా రిజిస్ట్రేషన్, రెన్యూవల్ సమయంలో చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలి.
బస్-బాడీ బిల్డింగ్ సంస్థలు, వాహనాల ఆపరేటర్లు నిబంధనలను అతిక్రమించకుండా కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
వాహనాల భద్రతకు సంబంధించి సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు (సీఐఆర్‌టీ) మార్గదర్శకాలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అమలు చేయాలి. ఎమర్జెన్సీ సమయాల్లో అడ్డంకిగా మారే అవకాశం ఉన్న బస్సులోపలి ఏర్పాట్లను తొలగించాలి. అవసరమైన మేరకు బస్సులను రికాల్ చేసి మార్పులు చేసేలా మార్గదర్శకాలు జారీ చేయాలి.
మోటార్ వాహన చట్టం, ఏఐఎస్ ప్రమాణాల ఉల్లంఘనలకు బస్సు తయారీదారులతో పాటు అధికారులు కూడా బాధ్యులు అయ్యేలా చర్యలు తీసుకోవాలి.
రోడ్డు ప్రమాద ఘటనల్లో బాధితులకు సహాయం, పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలి.
ఇటీవల రాజస్థాన్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో 20 మంది మరణించారు. ఈ నేపథ్యంలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ వద్ద ఫిర్యాదు దాఖలైంది. నిబంధనల అతిక్రమణ కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ఇది జీవించే హక్కు ఉల్లంఘనేనని తెలిపారు. దీంతో.. ప్రమాదానికి గల కారణాలపై అధ్యయనం నిర్వహించాలని సీఐఆర్‌టీని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది.
దీంతో వాహన లోపాలకు సంబంధించిన సీఐఆర్‌టీ ఓ నివేదికను సమర్పించింది. ప్రయాణికులు ఉండే భాగానికి, బస్సు డ్రైవర్‌కు మధ్య ఉన్న పార్టిషన్ కారణంగా డ్రైవర్లు ప్రమాద సమయంలో వేగంగా స్పందించలేకపోతున్నారని తెలిపింది. స్లీపర్ బెర్తులపై స్లైడర్స్, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లను సులువుగా వినియోగించుకునేలా ఏర్పాటు చేయకపోవడం, అగ్నికీలలు చెలరేగిన వెంటనే గుర్తించి ఆర్పేసే ఎఫ్‌డీఎస్ఎస్ వ్యవస్థ లేకపోవడం, తదితర సమస్యల కారణంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్టు తేల్చింది.
ఈ నేపథ్యంంలో నిబంధనల అమలులో తీవ్ర వ్యవస్థాగత లోపాల కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని భావించిన ఎన్‌హెచ్‌ఆర్సీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఇవి కూడా చదవండి...
ఎయిర్‌బస్ ఏ320 మోడల్ విమానాల్లో సాంకేతిక లోపం.. 6 వేల వరకూ ఫ్లైట్స్‌పై ప్రభావం
ఛత్తీస్‌గఢ్‌లో మరో 10 మంది మావోయిస్టుల లొంగుబాటు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి