ISRO: దేశ భద్రతావసరాల కోసం వచ్చే 3 ఏళ్లల్లో మరో 150 ఉపగ్రహ ప్రయోగాలు చేపడతాం.. ఇస్రో చీఫ్
ABN , Publish Date - Apr 24 , 2025 | 12:31 PM
దేశ రక్షణ అవసరాల కోసం వచ్చే మూడేళ్లల్లో మరో 150 ఉపగ్రహాలు అంతరిక్షంలో ప్రవేశపెడతామని ఇస్రో చీఫ్ వి.నారాయణన్ అన్నారు.

ఇంటర్నెట్ డెస్క్: రాబోయే మూడేళ్లల్లో 100 నుంచి 150 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెడతామని ఇస్రో చీఫ్ వి.నారాయణన్ తెలిపారు. ప్రస్తుతం భారత్‌కు ఉన్న 55 ఉపగ్రహాలు.. దేశ సరిహద్దులు, 7500 కిలోమీటర్ల తీర ప్రాంతంపై నిఘా పెట్టేందుకు సరిపోవని అన్నారు. అయితే, ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల కారణంగా అంతరిక్ష పరిశోధన, ఉపగ్రహ రూపకల్పన, ప్రయోగాల్లో ప్రైవేటు సంస్థల పాత్ర పెరుగుతుందని ఆయన అన్నారు. స్థానిక కావేరీ ఆసుపత్రిలో ఏఐ రోబోటిక్ వ్యవస్థ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ మేరకు తెలిపారు.
ఇస్రో ప్రస్తుత మిషన్ల గురించి కూడా వి.నారాయణన్ పలు వివరాలు వెల్లడించారు. శాటిలైట్ డాకింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సామర్థ్యం కలిగిన అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ కూడా చేరిందని అన్నారు. ఇక వాతావరణ మార్పులపై అధ్యయనం కోసం ఒక ఉపగ్రహ రూపకల్పనపై కూడా శాస్త్రవేత్తలు దృష్టి సారించినట్టు ఇస్రో చీఫ్ తెలిపారు. ఇది జీ20 అవసరాల కోసం ఉద్దేశించిన ఉపగ్రహమని, ఇందులో 50 శాతం భారత్ డిజైన్ చేయగా మిగతా అంశాల్లో ఇతర జీ20 దేశాలు భాగస్వాములవుతాయని అన్నారు.
ఉపగ్రహ ప్రయోగాలతో పాటు ప్రస్తుతం ఇస్రో గగన్‌యాన్ పేరిట మానవసహిత అంతరిక్ష యాత్రపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. చంద్రయాన్-4 మిషన్ నిర్వహించేందుకు కూడా ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది. శుక్రగ్రహ వాతావరణం, ఉపరితల అధ్యయనం కోసం శుక్రయాన్‌కు ప్రణాళికలు కూడా రిచిస్తోంది. అరుణ గ్రహాన్ని మరింతగా అధ్యయనం చేసేందుకు మంగళ్‌యాన్-2 పేరిట మరో మిషన్‌కు కూడా ఇస్రో సిద్ధమవుతోంది.
ఇవి కూడా చదవండి:
భారత్‌లో పాక్ ట్విట్టర్ అకౌంట్‌పై వేటు
పాక్ ఆర్మీ చీఫ్ బిన్ లాడెన్ లాంటోడు.. కశ్మీర్ దాడిపై అమెరికా అధికారి తీవ్ర ఆగ్రహం
న్యాయమూర్తులపై మహిళ సంచలన వ్యాఖ్య.. షాకిచ్చిన కోర్టు