Share News

JP Nadda: కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రి జేపీ మంత్రి సౌదీ పర్యటన

ABN , Publish Date - Jul 14 , 2025 | 03:56 PM

భారత్‌లో ఎరువుల సరఫరా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. వచ్చే సంవత్సరానికి 31 లక్షల మెట్రిక్ టన్నుల డి.ఎ.పిని దిగుమతి చేసుకునేందుకు సౌదీ అరేబియాతో ఒప్పందం కుదుర్చుకుంది. సౌదీ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి జేపీ నడ్డా సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది.

JP Nadda: కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రి జేపీ మంత్రి సౌదీ పర్యటన
India Saudi Arabia fertilizer deal

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఖరీఫ్‌ సీజన్‌లో అంచనాలకు మించి యూరియా వినియోగం కావడంతో అదనపు ఎరువుల కోసం కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగింది. వచ్చే సంవత్సరానికి 31 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీని దిగుమతి చేసుకునేందుకు సౌదీ అరేబియాతో ఒప్పందం కుదుర్చుకుంది.

భారత్‌కు అవసరమైన మేరకు ఎరువుల ఉత్పత్తి కోసం ముడి సరుకు, ఎరువులను సరఫరా చేసే విషయాన్ని స్వయంగా పరిశీలించేందుకు సౌదీ అరేబియాకు వెళ్లిన కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జె.పి. నడ్డా రాజధాని రియాధ్‌లో సౌదీ మంత్రులు ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్, బందర్ బిన్ ఇబ్రహీం ఖోరెఫ్‌లతో చర్చలు జరిపారు.

అంతకు ముందు ఆదివారం మంత్రి దేశంలోని రైతులకు అత్యధికంగా యూరియా, ఇతర ఎరువులను ఉత్పత్తి చేసి సరఫరా చేసే క్రిభ్కో, ఇతర సంస్థల ప్రతినిధుల బృందంతో కలిసి సౌదీ అరేబియాలో పర్యటించారు. రాస్ అల్ ఖైర్ ప్రాంతంలో ఉన్న మాదెన్ అనే ప్రముఖ గనులు, ఎరువుల సంస్థ ఫ్యాక్టరీని సందర్శించారు.


ఈ ఖరీఫ్ సీజన్‌లో కేంద్రం 52 లక్షల టన్నుల యూరియా వినియోగాన్ని అంచనా వేయగా ఇంకా నాటు కాలం పూర్తి కాక ముందే 48 లక్షల టన్నుల విక్రయం జరిగిందని, పంట చేతికి వచ్చే సరికి మరింత యూరియా అవసరమవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. గత కొంత కాలంగా ప్రతి సీజన్‌లో రాష్ట్రాల నుండి ఎరువుల కోసం అనూహ్యమైన డిమాండ్ వస్తుండడంతో ఎరువులు, ప్రత్యేకించి యూరియా, పోటాష్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా నరేంద్ర మోదీ సర్కారు ప్రయత్నం చేస్తుంది. ఈ దిశగా కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ సౌదీ అరేబియాతో అనేక సార్లు చర్చలు జరిపారు.


రష్యా, మొరాకో, జోర్డాన్, ఈజిప్టు, చైనా దేశాలు భారతీయ ఎరువుల ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకును అందిస్తున్నా భౌగోళిక రాజకీయ అంశాలు, ధర, సమయం కారణంగా భారత్.. సౌదీ అరేబియా వైపు మొగ్గు చూపుతుంది. దేశంలో ప్రతిసారి ఎరువుల కొరత రావడంతో శాశ్వత పరిష్కారం కోసం సౌదీ అరేబియా వైపు దృష్టి మళ్లించింది. సౌదీ అరేబియా, ఇతర అరబ్బు దేశాల నుండి దిగుమతయ్యే ఎరువుల్లో అత్యధిక భాగం ఈశాన్య తీరంలోని కాకినాడ, విశాఖపట్టణం, పారాదీప్ నౌక రేవులకు చేరుకుంటాయి. ఈ నేపథ్యంలో తెలుగు రైతుల పక్షాన కేంద్ర మంత్రి నడ్డాకు తెలుగు ప్రవాసీ ప్రముఖుడు, చిత్తూరు జిల్లాకు చెందిన రంజీత్ చిట్లూరి కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

మహారాష్ట్రలో మరో కలకలం.. హిందీలోనే మాట్లాడతానన్న ఆటో డ్రైవర్‌పై దాడి

సారే జహాసే అచ్ఛా.. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఫేర్‌వెల్ పార్టీలో శుభాంశూ శుక్లా సందేశం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 15 , 2025 | 12:07 AM