Share News

Chhattisgarh: భారీ ఎన్‌కౌంటర్‌.. ఎంతమంది మావోలు మృతంటే..

ABN , Publish Date - Jul 18 , 2025 | 07:23 PM

ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రం నారాయణ్‌పూర్ జిల్లా అబుజ్మద్ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మృతిచెందారు.

Chhattisgarh: భారీ ఎన్‌కౌంటర్‌.. ఎంతమంది మావోలు మృతంటే..
Chhattisgarh

ఛత్తీస్‌ఘఢ్‌: ఆపరేషన్ కగార్‌లో భాగంగా మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇవాళ (శుక్రవారం) ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రం నారాయణ్‌పూర్ జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోలు మృతిచెందారు. అబుజ్మద్ అటవీ ప్రాంతంలో ఇవాళ మధ్యాహ్నం భద్రతా దళాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పుకొచ్చారు. దీంతో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆరుగురు మావోలు మృతిచెందారని, వారి నుంచి పెద్దమొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.


ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారని భద్రతా దళాలకు నిఘా సమాచారం అందిందని సదరు పోలీసు అధికారి తెలిపారు. దీంతో, భద్రతా దళాలు ఆ ప్రాంతంలో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌కు దిగాయి. మావోల జాడ తెలుసుకున్న భద్రతా దళాలు లొంగిపోవాలని మావోయిస్టులను కోరినప్పటికీ వారు కాల్పులు ప్రారంభించారని, ప్రతిగా తాము జరిపిన కాల్పుల్లో ఆరుగురు మావోలు మరణించారని పోలీసులు చెబుతున్నారు.


ఇవాళ మధ్యాహ్నం నుంచి భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య అనేకసార్లు కాల్పులు జరిగాయని ఆ పోలీసు అధికారి తెలిపారు. ఇప్పటివరకు ఎన్‌కౌంటర్ స్థలం నుంచి ఆరుగురు నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, వారి నుంచి AK-47 / SLR రైఫిళ్లు, ఇతర ప్రాణాంతక ఆయుధాలు, పేలుడు పదార్థాలు, రోజువారీ వాడుకునే సామన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇంకా భద్రతా దళాల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.


ఇవి కూడా చదవండి..

న్యూజిలాండ్ జనాభాకు మించి బిహార్‌కు ఇళ్లిచ్చాం: మోదీ

అధికారికంగా గుడ్‌బై.. ఇండియా కూటమికి ఆప్ షాక్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 18 , 2025 | 08:07 PM