Share News

HP Govt Teacher Suspended: ఇంగ్లిష్‌ పదాల్లో స్పెల్లింగ్ మిస్టేక్స్.. ప్రభుత్వ టీచర్‌పై సస్పెన్షన్ వేటు

ABN , Publish Date - Oct 06 , 2025 | 04:25 PM

దారుణ అక్షర దోషాలతో చెక్కు రాసిచ్చిన ఓ ప్రభుత్వ టీచర్‌పై హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖ సీరియస్ అయ్యింది. ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.

HP Govt Teacher Suspended: ఇంగ్లిష్‌ పదాల్లో స్పెల్లింగ్ మిస్టేక్స్.. ప్రభుత్వ టీచర్‌పై సస్పెన్షన్ వేటు
Govt teacher suspended in Himachal

ఇంటర్నెట్ డెస్క్: దారుణ అక్షర దోషాలతో చెక్కు రాసిచ్చిన హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ టీచర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఉదంతాన్ని సీరియస్‌గా తీసుకున్న విద్యాశాఖ ఈ కఠిన చర్యకు దిగింది (Spelling Mistakes in Cheque).

రోహ్నత్‌లోని ప్రభుత్వ సీనియర్ సెకెండరీ స్కూల్ టీచర్ అట్టర్ సింగ్ ఈ చెక్కును రాసిచ్చారు. ఈ చెక్కు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులోని అక్షర దోషాలు చూసి జనాలు షాకయిపోయారు. ఓ టీచర్ ఇన్ని తప్పులు చేస్తారా అంటూ నోరెళ్లబెట్టారు. రూ.7,616కు సదరు టీచర్ ఈ చెక్కును రాశారు. అందులో సెవెన్ (seven) అని ఇంగ్లిష్‌లో రాసే బదులు saven అని పొరపాటు స్పెల్లింగ్ రాశారు. హండ్రెడ్‌కు (Hundred) Harendra అని, సిక్స్‌కు బదులు సిక్స్టీ అని ఇష్టారీతిన రాశారు. కనీసం సంఖ్యను కూడా పలకడం తెలీదనిపించేటట్టు టీచర్ రాత ఉండటంతో గగ్గోలు రేగింది. దీంతో, బ్యాంకు ఈ చెక్కును తిరస్కరించింది. ఆ తరువాత ఈ చెక్కు ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జనాలు షాకయిపోయారు (Govt teacher suspended in Himachal ).


ఈ విషయాన్ని డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సీరియస్‌గా తీసుకుంది. సదరు స్కూల్ ప్రిన్సిపాల్, సంబంధిత టీచర్, ఇతర అధికారుల నుంచి వివరణ తీసుకుంది. స్కూల్ టీచర్, ప్రిన్సిపాల్ వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తాను తప్పు చేసినట్టు సింగ్ అంగీకరించారు. అన్ని జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైనట్టు చెప్పుకొచ్చారు. అయితే, విద్యాశాఖ అధికారులు మాత్రం ఆయన వివరణను అంగీకరించలేదు. విద్యాశాఖ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించే చర్యల విషయంలో నిబంధనల ప్రకారం, కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. శాఖాపరమైన దర్యాప్తును ప్రారంభించారు. చెక్కుపై సంతకం చేసిన ప్రిన్సిపల్ విషయాన్ని కూడా పరిశీలిస్తున్నామని అధికారులు అన్నారు.

చెక్కుపై ఇన్ని అక్షర దోషాలు కనిపించడంతో జనాలు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన నాణ్యతపై పలువురు సందేహాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ దర్యాప్తునకు ఆదేశించింది.


ఇవి కూడా చదవండి:

పండుగ సీజన్‌లో టిక్కెట్ ధరలు.. ఎయిర్‌లైన్స్‌ను అప్రమత్తం చేసిన డీజీసీఏ

దగ్గు మందుతో చిన్నారుల మృతి.. మధ్యప్రదేశ్ వైద్యుడి అరెస్టు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 06 , 2025 | 04:34 PM