Haridwar Stampede: హరిద్వార్ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా
ABN , Publish Date - Jul 27 , 2025 | 09:21 PM
హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయం సమీపంలో జరిగిన తొక్కిసలాట మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మానసా దేవి ఆలయ ట్రస్ట్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

హరిద్వార్ (ఉత్తరాఖండ్), జూలై 27 : ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయం సమీపంలో జరిగిన తొక్కిసలాట మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మానసా దేవి ఆలయ ట్రస్ట్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ (ఆదివారం) ఉదయం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించగా మరో 25 మంది గాయాలపాలైన సంగతి తెలిసిందే. గాయపడ్డవారికి సమీప ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఇక, ఈ ఘటనలో గాయపడిన ప్రతి ఒక్కరికి రూ. 50,000 చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ తొక్కిసలాట చోటుచేసుకుంది. అటు, ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా అదే మొత్తంలో ఎక్స్ గ్రేషియా పరిహారాన్ని ప్రకటించింది. ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. గాయపడిన వారికి సమీప ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తుండగా, కొందరిని రిషికేశ్ ఎయిమ్స్ కు రిఫర్ చేశారు.
ముఖ్యమంత్రి.. హరిద్వార్ జిల్లా ఆసుపత్రిని సందర్శించి, మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. అవసరమైన అన్ని ఏర్పాట్లు వెంటనే చేశామని, బాధిత కుటుంబాలకు సాధ్యమైన అన్ని సహాయాలను అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని, ఈ విషాద ఘటనలో బాధితులకు, వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.
ఎయిమ్స్ రిషికేశ్ డైరెక్టర్ డాక్టర్ మీను సింగ్ మాట్లాడుతూ, ఆదివారం ఉదయం హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం ఎయిమ్స్ రిషికేశ్‌లో చేరిన 10 మందిలో ఇద్దరు పిల్లలున్నారని ఆమె అన్నారు. 'ఈ ఘటన ఉదయం 9 గంటల ప్రాంతంలో జరిగింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో గాయపడ్డవాళ్లు ఆస్పత్రికి రావడం ప్రారంభించారు. ఇప్పటివరకు 15 మందిని ఇక్కడికి తీసుకువచ్చారు. 4-5 మందికి స్వల్ప గాయాలు కావడంతో వారికి చికిత్స చేసి పంపించాం. ఆస్పత్రిలో చేరిన 10 మందిలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డవాళ్లందరికీ చికిత్స జరుగుతోంది.' అని డాక్టర్ సింగ్ తెలిపారు.
ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయానికి వెళ్లే మార్గంలో ఈ ఉదయం జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. Xలో ఒక పోస్ట్‌లో రాష్ట్రపతి ముర్ము 'హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయానికి వెళ్లే మార్గంలో జరిగిన తొక్కిసలాట ప్రమాదంలో అనేక మంది భక్తులు మరణించిన వార్త చాలా బాధాకరం. దుఃఖంలో ఉన్న అన్ని కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. గాయపడిన భక్తులందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను' అని ఆమె తన సందేశంలో పేర్కొన్నారు.