Share News

Waqf Trust Land: వక్ఫ్ ట్రస్టీలుగా నటించి వందల కోట్లు కొట్టేసిన ఐదుగురు అరెస్ట్

ABN , Publish Date - Apr 20 , 2025 | 08:55 PM

వక్ఫ్ ట్రస్టీలుగా నటిస్తూ 17 ఏళ్ల పాటు వందల ఇళ్లు, షాపులు నిర్మించి వందల కోట్ల రూపాయలు కొట్టేశారు కొందరు కేటుగాళ్లు. ఈ ఐదుగుర్ని ఇవాళ పోలీసులు అరెస్ట్ చేసి లోపలేశారు.

Waqf Trust Land: వక్ఫ్ ట్రస్టీలుగా నటించి వందల కోట్లు కొట్టేసిన ఐదుగురు అరెస్ట్
Waqf trust land fake trustees:

Waqf trust land: 'వక్ఫ్'పేరిట ఇంతకాలం గుట్టుగా కొల్లగొట్టిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకొస్తున్నాయి. తాజాగా గుజరాత్‌లో గుండెలదిరే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది.'వక్ఫ్ ట్రస్ట్ భూమి'పై ట్రస్టీలుగా నటిస్తూ ఏకంగా 17 ఏళ్ల పాటు వందల ఇళ్లు, దుకాణాలపై అద్దె వసూలు చేసినందుకు ఐదుగుర్ని అరెస్టు చేశారు గుజరాత్ పోలీసులు. ఈ ఐదుగురు పేర్లు .. 1. సలీం ఖాన్ పఠాన్, 2.మహమ్మద్ యాసర్ షేక్, 3. మహమ్మద్ ఖాన్ పఠాన్, 4 ఫైజ్ మొహమ్మద్ చోబ్దార్, 5. షాహిద్ అహ్మద్ షేక్ వీరందర్నీ ఇవాళ కటకటాలవెనక్కి నెట్టారు పోలీసులు.

సలీం ఖాన్ అనే నకిలీ ట్రస్టీ సదరు భూమిలో పది దుకాణాలను నిర్మించాడు. వాటిలో ఒకదాన్ని నిందితుడు తన ఆఫీస్ పెట్టుకుని, మిగిలిన దుకాణాలను అద్దెకు ఇచ్చాడు. వీటిపై వచ్చే రెంట్స్‌ని 17 ఏళ్లుగా సొంతానికి అనుభవిస్తున్నాడు. పోలీసు నివేదికల ప్రకారం, రాష్ట్రంలోని 'వక్ఫ్ బోర్డు' కింద నమోదైన అహ్మదాబాద్‌కు చెందిన రెండు ట్రస్టుల యాజమాన్యంలోని భూమిపై నిర్మించిన నిర్మాణాలకు ట్రస్టీలుగా నటిస్తూ 17 సంవత్సరాల నుంచి వీళ్లంతా అద్దె వసూలు చేసుకుంటూ దర్జాలు, దాదాగిరి చేస్తున్నారు.

అహ్మదాబాద్ నగరంలోని గైక్వాడ్ హవేలి పోలీస్ స్టేషన్‌లో నమోదైన FIR (ప్రథమ సమాచార నివేదిక) ప్రకారం, 'కచ్ని మసీదు ట్రస్ట్' ఇంకా 'షా బడా కసమ్ ట్రస్ట్'కు చెందిన భూమిపై దాదాపు 100 ఇళ్ళు, దుకాణాల నుండి ఈ మోసగాళ్ళు అద్దె వసూలు చేశారు. వక్ఫ్ బోర్డు కింద నమోదు చేయబడిన ట్రస్టులకు చెందిన ఆస్తులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారని దర్యాప్తులో తేలిన తర్వాత పోలీసులు వారిపై మోసం, ఇంకా నకిలీ పత్రాలు సృష్టించినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేశామని అహ్మదాబాద్ డిసిపి భరత్ రాథోడ్ అన్నారు. "నిందితులు రెండు ట్రస్టులకు చెందిన 5,000 చదరపు మీటర్లకు పైగా అక్రమ నిర్మాణాన్ని చేపట్టారని. వాళ్లు 2008 - 2025 మధ్య దాదాపు 100 ఆస్తులను (ఇళ్ళు, దుకాణాలు) నిర్మించారని చెప్పారు. వీటిపై నెలవారీ అద్దెలు వసూలు చేశారని రాథోడ్ చెప్పారు. కాగా, ఇక ఈ దందాలో లీడ్ రోల్ ప్లే చేసిన సలీం ఖాన్ ఒక పేరు మోసిన రౌడీ షీటర్ అని తెలుస్తోంది. ఆయుధాలు కలిగి ఉన్నాడన్న నేరంతో ఇతనిపై ఇప్పటికే ఐదు క్రిమినల్ కేసులు నడుస్తున్నాయి.

ఈ వ్యవహారాన్నంతా బట్టబయలు చేసింది.. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.. మొహమ్మద్ రఫీక్ అన్సారీ అనే వ్యక్తి. ఇతను సదరు ఇళ్లలో అద్దెకు ఉండే వాడు. అతని మాటల ప్రకారం కచ్ని మసీదు ట్రస్ట్‌కు చెందిన భూమిలో కూడా అక్రమంగా నిర్మాణాలు జరిపి 17ఏళ్లుగా అద్దెలు వసూలు చేసుకుంటున్నారని.. నిందితుల్లో ఎవరూ ఏ ట్రస్టులోనూ సభ్యులు కాదని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఏళ్లకు ఏళ్లుగా వచ్చిన అద్దె డబ్బును తమ ప్రయోజనం కోసం ఉపయోగించుకోవడమే కాకుండా, షా బడా కాసి ట్రస్ట్ యొక్క విరాళాల పెట్టెలో సేకరించిన డబ్బును కూడా నిందితులు వాడుకున్నారని కూడా చెప్పుకొచ్చాడు. కాగా, నిందితులు కచ్ని మసీదు ట్రస్ట్‌కు చెందిన భూమిలో 15 దుకాణాలను నిర్మించారని కూడా ఆరోపణలు ఉన్నాయి. గతంలో, ఈ భూమిని ఉర్దూ పాఠశాల కోసం అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (AMC)కి అప్పగించారు.

అయితే, 2001 భూకంపం సమయంలో, పాఠశాల నిర్మాణం శిథిలావస్థకు చేరుకుంది. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 2009లో పాఠశాలను కూల్చివేసి సమీపంలోని ప్రాంతానికి మార్చింది. ఇంతలో, ఆ నకిలీ ట్రస్టీలు సదరు పాఠశాల స్థలంలో పది దుకాణాలను నిర్మించారు. ఇందులోని ఒకదాన్ని నిందితుడు సలీం ఖాన్ తన కార్యాలయం పెట్టుకున్నాడు. మిగిలిన వాటిని అద్దెకు ఇచ్చాడని ఫిర్యాదుదారుడు పోలీసులకు పూర్తి వివరాలతో సహా సమాచారం ఇచ్చాడు. నిందితులు వసూలు చేసిన అద్దెలను ఏనాడూ ట్రస్ట్ ఖాతాలో జమ చేయలేదని లేదా AMCకి అప్పగించలేదని ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. ఈ విధంగా, ఈ ఐదుగురు AMC, ఇంకా 'వక్ఫ్ బోర్డు'ని మోసం చేశారని రఫీక్ అన్సారీ చెప్పాడు.

వక్ఫ్ ఆస్తి అంటే ఏమిటి?

వక్ఫ్ ఆస్తి మతపరమైన లేదా దాతృత్వ ప్రయోజనాలకు అంకితం చేయబడింది. అటువంటి ఆస్తుల నుండి వచ్చే ఆదాయాన్ని సాధారణంగా మతపరమైన కార్యకలాపాలు, దాతృత్వ పనులు లేదా ప్రజా ప్రయోజనం కోసం ఉపయోగిస్తారు.


ఇవి కూడా చదవండి:

Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..
Bill Gates: వారానికి మూడు రోజేలే పని..బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
iPhone like Design: రూ.6 వేలకే ఐఫోన్ లాంటి స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు..
Monthly Income: 50 ఏళ్ల తర్వాత నెలకు రూ.లక్ష కావాలంటే ఎంత సేవ్ చేయాలి, ఎన్నేళ్లు చేయాలి

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 20 , 2025 | 09:05 PM