Four Month Old Baby Stolen: దంపతుల దారుణం.. గుడి దగ్గర భిక్షమెత్తే మహిళ బిడ్డను..
ABN , Publish Date - Dec 01 , 2025 | 06:25 PM
ఓ భార్యాభర్తల జంట గుడి దగ్గర భిక్షమెత్తే మహిళ బిడ్డను కిడ్నాప్ చేసింది. ఆ బిడ్డను వేరే జంటకు అమ్మడానికి ప్రయత్నించింది. చివరకు పాపం పండి జైలు పాలైంది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది.
ఈజీ మనీ కోసం ఓ భార్యాభర్తల జంట దారుణానికి ఒడిగట్టింది. గుడి ముందు బిక్షమెత్తే మహిళ బిడ్డను ఎత్తుకెళ్లిపోయింది. ఆ బిడ్డను వేరే జంటకు అమ్మడానికి ప్రయత్నించింది. చివరకు పాపం పండి ఆ జంట అడ్డంగా పోలీసులకు దొరికిపోయింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కాన్పూర్‌లోని సెన్ పశ్చిమపర ప్రాంతానికి చెందిన సచిన్, గరిమలకు పెళ్లై పదేళ్లు పైనే అయింది. అయినా వారికి పిల్లలు లేరు. ఈ నేపథ్యంలోనే ఆటో డ్రైవర్ జితేంద్ర, అతడి భార్య గీతలను సంప్రదించారు.
తమకు ఓ బిడ్డ కావాలని, లక్షలు ఇవ్వడానికి అయినా రెడీగా ఉన్నామని చెప్పారు. దీంతో జితేంద్ర, గీతలు బిడ్డ కోసం అన్వేషిస్తూ ఉన్నారు. సోనీ అనే భిక్షగత్తె నాలుగు నెలల క్రితం ఓ బిడ్డకు జన్మనిచ్చింది. 13 సంవత్సరాల తన కూతురితో పాటు నాలుగు నెలల బిడ్డతో కలిసి పంకీ గుడి దగ్గర భిక్షమెత్తుతూ జీవనం సాగిస్తోంది. వారి కన్ను నాలుగు నెలల ఆ బిడ్డపై పడింది. బిడ్డను కిడ్నాప్ చేయడానికి ఓ పక్కా ప్లాన్ వేశారు. పసికందును కూతురి దగ్గర వదిలి సోనీ గుడి ముందు భిక్షం ఎత్తుతూ ఉంది.

పసికందును వదిలి సోనీ కూతురు సమోసా తినడానికి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన గీత బిడ్డను తీసుకుని పరుగులు తీసింది. జితేంద్ర గుడికి కొంత దూరంలో ఆటోతో రెడీగా ఉన్నాడు. ఆమె ఆటో ఎక్కింది. ఆ వెంటనే ఆటో అక్కడినుంచి వెళ్లిపోయింది. అయితే, బిడ్డ అరుపులు విన్న సోనీ ఆటోను వెంబడించింది. అయినా లాభం లేకుండా పోయింది. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శాస్త్రీ నగర్ దగ్గర బిడ్డతో సహా నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి
శీతాకాలం.. పిల్లలను వ్యాధుల నుండి రక్షించడానికి ఇలా చేయండి.!
ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం సీరియస్.. కేంద్రంపై మండిపాటు..