Father Sponsoring Weddings: గొప్ప మనసు.. కొడుకు పెళ్లి రోజే 11 పేద జంటలకు పెళ్లి చేసిన తండ్రి
ABN , Publish Date - Jul 28 , 2025 | 09:08 PM
Father Sponsoring Weddings: కంబలిపురలోని కాటేరమ్మ గుడిలో మొత్తం 12 పెళ్లిళ్లు జరిగాయి. ఈ పెళ్లిళ్ల కోసం పెళ్లి బట్టలు, బంగారు తాళి, పెళ్లి ఖర్చులకు పది వేల రూపాయలు కూడా ఇచ్చాడు. మొత్తం 12 పెళ్లిళ్లు వేద మంత్రాల నడుమ, ఎంతో సంబరంగా జరిగాయి.

డబ్బు ఉన్నా లేకపోయినా.. తమకు ఉన్నంతలో తమ కొడుకు పెళ్లి ఘనంగా చేయాలని ఏ తండ్రైనా అనుకోవటం సర్వసాధారణ విషయం. కొంతమంది అప్పు చేసి మరీ పెళ్లిళ్లు ఘనంగా చేస్తుంటారు. అయితే, ఓ తండ్రి మాత్రం ఉన్నతంగా ఆలోచించాడు. పది మందికి ఆదర్శంగా నిలిచే పని చేశాడు. తన కొడుకు పెళ్లి రోజే 11 పేద జంటలకు పెళ్లి చేశాడు. ఆ 11 పెళ్లిళ్లకు అయ్యే ఖర్చులు కూడా ఆయనే భరించాడు. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరు రూరల్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. హొసకోటె తాలూకాకు చెందిన రాము అనే వ్యక్తి కొడుక్కు కొన్ని నెలల క్రితమే పెళ్లి నిశ్చయం అయింది. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయింది. సంపన్నుడైన రాము తలుచుకుంటే కొడుకు పెళ్లి అత్యంత ఘనంగా చేయగలడు. కానీ, అది ఆయనకు నచ్చలేదు. డబ్బులు వృథా ఖర్చు అనుకున్నాడు. తన కొడుకు పెళ్లితో పాటు పేద జంటల పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకున్నాడు. ఇందుకోసం 11 పేద జంటల్ని గుర్తించాడు.
తాజాగా, కంబలిపురలోని కాటేరమ్మ గుడిలో మొత్తం 12 పెళ్లిళ్లు జరిగాయి. ఈ పెళ్లిళ్ల కోసం పెళ్లి బట్టలు, బంగారు తాళి, పెళ్లి ఖర్చులకు పది వేల రూపాయలు కూడా ఇచ్చాడు. మొత్తం 12 పెళ్లిళ్లు వేద మంత్రాల నడుమ, ఎంతో సంబరంగా జరిగాయి. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా వైరల్‌గా మారింది. కొడుకు పెళ్లి రోజే 11 పేద జంటలకు పెళ్లిళ్లు చేసి రాముపై జనాలు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడంటూ కొనియాడుతున్నారు.
ఇవి కూడా చదవండి
క్యూట్ వీడియో.. ఏనుగు పిల్ల చేసిన పనికి అందరూ నవ్వేశారు..
ఓటర్ కార్డు కోసం అప్లై చేసుకున్న డాగ్ బాబు.. తర్వాత ఏం జరిగిందంటే..