Share News

FASTag Annual Pass: ఆగస్టు 15న ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ లాంఛ్.. పూర్తి ఫీచర్స్ ఇవే

ABN , Publish Date - Aug 03 , 2025 | 11:27 AM

స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశంలో ఫాస్టాగ్ వార్షిక పాస్ లాంఛ్ కానుంది. మరి ఈ పాస్ ఫీచర్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను కూలంకషంగా తెలుసుకుందాం.

FASTag Annual Pass: ఆగస్టు 15న ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ లాంఛ్.. పూర్తి ఫీచర్స్ ఇవే
FASTag Annual Pass

ఇంటర్నెట్ డెస్క్: హైవేలపై ప్రయాణం మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఫాస్టాగ్ వార్షిక పాస్‌ను త్వరలో ప్రారంభించనుంది. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పాస్‌ను లాంఛ్ చేయనున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. మరి త్వరలో అందుబాటులోకి రానున్న ఈ పాస్ ముఖ్య ఫీచర్లు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఏమిటీ ఫాస్టాగ్ వార్షిక పాస్

ప్రైవేటు కార్లు, జీపులు, వ్యాన్‌లు తదితరాల కోసం కేంద్రం ఈ పాస్‌ను ప్రవేశపెట్టింది. వార్షిక ఫీజు చెల్లించి ఈ పాస్ తీసుకుంటే టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేక ఫీజులేవీ చెల్లించకుండా సాఫీగా జర్నీ చేయొచ్చు. ఏడాది కాలం లేదా 200 ట్రిప్పుల వరకూ వినియోగించుకోవచ్చు.

ధర ఎంతంటే

2025-26కి గాను కేంద్రం ఫాస్టాగ్ వార్షిక ఫీజును రూ.3 వేలుగా నిర్ణయించింది. రాజ్‌మార్గ్ యాత్ర యాప్ లేదా ఎన్‌హెచ్ఏఐ వెబ్‌సైట్ ద్వారా ఈ మొత్తాన్ని చెల్లించి పాస్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.


పాస్ యాక్టివేషన్ ఇలా

వాహనం, దాని అనుబంధ ఫాస్టాగ్ అర్హతను ధ్రువీకరించాక పాస్‌ను జారీ చేస్తారు. రూ.3 వేలను చెల్లించాక సంబంధిత ఫాస్టాగ్‌కు అనుబంధంగా పాస్ యాక్టివేట్ అవుతుంది. అర్హత ధ్రువీకరణ అనంతరం డబ్బులు చెల్లించిన రెండు గంటలకు పాస్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది.

వ్యాలిడిటీ ఇదీ

సంవత్సరకాలం లేదా 200 ట్రిప్పుల పరిమితిపై ఈ పాస్‌ను జారీ చేస్తారు. అంటే.. ఏడాది లోపు 200 ట్రిప్పులు పూర్తయిపోతే సాధారణ ఫాస్టాగ్ యాక్టివేట్ అవుతుంది. ఆపై టోల్ ఫీజులు పాత విధానంలో చెల్లించాల్సి ఉంటుంది.

పాస్ బదిలీ సాధ్యమేనా

ఈ పాస్ బదిలీ సాధ్యం కాదని కేంద్రం గతంలోనే స్పష్టం చేసింది. పాస్ జారీ అయిన వాహనం వరకే ఈ సౌలభ్యం పరిమితం. దీన్ని మరో వాహనంపై యూజర్ వాడితే పాస్ డీయాక్టివేట్ అవుతుంది.

ఒక ట్రిప్ అంటే..

పాయింట్ ఆధారిత ఫీజులు ఉండే టోల్ ప్లాజాల మీదుగా ఒకసారి ప్రయాణిస్తే ఒక ట్రిప్‌గా పరిగణిస్తారు. అంటే.. ఇలాంటి చోట్ల రానుపోనూ ప్రయాణాన్ని రెండు ట్రిప్పులుగా భావించాలి. ఒక క్లోజ్డ్ టోలింగ్ ఫీ ప్లాజా వద్ద ఒక ఎంట్రీ, ఒక ఎగ్జిట్‌ను కలిపి ఒక ట్రిప్‌గా పరిగణిస్తారు.


ఇవి కూడా చదవండి:

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మంచి జనాదరణ.. ఆక్యుపెన్సీ రేషియో ఎంతంటే..

ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా ప్రధాని మోదీ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 03 , 2025 | 12:28 PM