POCSO Act judgment: మైనర్లపై లైంగిక దాడి.. అలా చేసినా అత్యాచారమే.. బాంబే హైకోర్టు తీర్పు..
ABN , Publish Date - Oct 21 , 2025 | 01:00 PM
మైనర్లపై లైంగిక దాడి విషయంలో బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ తాజాగా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. బాధితులు మైనర్లు అయినప్పుడు స్వల్ప పెనెట్రేషన్ కూడా అత్యాచారం కిందకే వస్తుందని స్పష్టం చేసింది.
మైనర్లపై లైంగిక దాడి విషయంలో బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ తాజాగా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. బాధితులు మైనర్లు అయినప్పుడు స్వల్ప పెనెట్రేషన్ కూడా అత్యాచారం కిందకే వస్తుందని స్పష్టం చేసింది. వార్ధా జిల్లాలోని హింగాన్ఘాట్కు చెందిన 38 ఏళ్ల డ్రైవర్ అప్పీల్‌ను తోసిపుచ్చిన హైకోర్ట్ బెంచ్ నిందితుడికి 10 సంవత్సరాల జైలు శిక్షను సమర్థించింది (minor consent law India).
నిందితుడు 2014లో 5, 6 సంవత్సరాల వయసున్న బాలికలకు జామపళ్లు ఇస్తానని ఆశ చూపించి, అశ్లీల వీడియోలను చూపించి లైంగిక వేధింపులకు ప్రయత్నించాడు. ఆ విషయాన్ని ఆ పిల్లలు తమ తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ట్రయల్ కోర్టు అతడికి జైలు శిక్ష విధించింది. ఆ తీర్పును నిందితుడు హైకోర్టులో సవాలు చేశాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో తనను తప్పుడు కేసులో ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని, తాను అత్యాచారానికి పాల్పడినట్టు ఎటువంటి ఆధారాలూ లేవని నిందితుడు వాదించాడు (child protection law).
ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ మెహతా తాజాగా తీర్పు వెలువరించారు. తప్పుడు కేసులో ఇరికించడానికి ప్రయత్నించారనే వాదనకు సాక్ష్యాలు లేవని అన్నారు. అలాగే 15 రోజుల తర్వాత బాలికకు నిర్వహించిన వైద్య పరీక్షలో ఆమె ప్రైవేట్ భాగాలపై ఎటువంటి గాయాలూ లేకపోవడాన్ని పరిగణనలోకి తీసుకోలేమని, చిన్న వయసు కారణంగా బాలిక గాయాలు నయం కావొచ్చని జస్టిస్ మెహతా పేర్కొన్నారు. మైనర్ల ప్రైవేట్ భాగాలలోకి ఏ శరీర భాగాన్ని చొప్పించినా అది అత్యాచారం లేదా తీవ్రమైన లైంగిక దాడి అవుతుందన్నారు. చొచ్చుకుపోయే లోతు అప్రస్తుతమని తేల్చి చెప్పారు (consent and minors).
ఇదే సమయంలో ట్రయల్ కోర్టు చేసిన తప్పిదాన్ని కూడా జస్టిస్ మెహతా సరిదిద్దారు (POCSO Act judgment). ఈ నేరం ఫిబ్రవరి 19, 2014న జరిగింది. అయితే పోక్సో చట్టం 2019లో అమల్లోకి వచ్చింది. 2014 నాటి నేరానికి 2019 నాటి పోక్సో చట్టం ఆధారంగా ట్రయల్ కోర్టు శిక్ష విధించింది. కనీసంగా 20 సంవత్సరాల జైలు శిక్షను సూచించే సెక్షన్ 6 సవరించిన నిబంధనపై ట్రయల్ కోర్టు ఆధారపడటం, అలాగే శిక్షను లెక్కించడానికి పోక్సో చట్టంలోని సెక్షన్ 18ని ప్రయోగించడం చట్టబద్ధంగా తప్పని జస్టిస్ మెహతా అభిప్రాయపడ్డారు. అయితే నిందితుడికి విధించిన 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష సవరించని చట్టం సూచించే కనీస శిక్షకు అనుగుణంగా ఉందని, కాబట్టి శిక్షలో ఎటువంటి మార్పు అవసరం లేదని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
డీల్ ఆర్ నో డీల్.. చైనా ఒప్పుకోకపోతే 155 శాతం సుంకాలు.. ట్రంప్ బెదిరింపు..
స్వల్పంగా తగ్గింది.. మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మరిన్ని తాజా వార్తలు కోసం క్లిక్ చేయండి..