Bengaluru Cocaine Seizure: కామిక్స్ పుస్తకాల్లో కొకైన్ స్మగ్లింగ్.. బెంగళూరు ఎయిర్‌పోర్టులో నిందితుడి అరెస్టు
ABN , Publish Date - Jul 20 , 2025 | 07:17 PM
కామిక్ పుస్తకాల్లో రూ.40 కోట్ల విలువైన కొకైన్‌ను దాచి తీసుకొచ్చిన ఓ వ్యక్తిని బెంగళూరు ఎయిర్‌పోర్టులో డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు. అతడి నుంచి 4 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: కామిక్స్ పుస్తకాల్లో కొకైన్‌ను దాచి స్మగ్లింగ్‌కు యత్నించిన ఓ వ్యక్తి బెంగళూరు ఎయిర్‌పోర్టులో దొరికిపోయాడు. అతడి నుంచి ఏకంగా రూ.40 కోట్ల విలువైన కొకైన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దోహా నుంచి బయలుదేరిన అతడు జులై 18న ఉదయం బెంగళూరు ఎయిర్‌పోర్టుకు వచ్చిన సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారంతో రంగంలోకి దిగిన డీఆర్ఐ అధికారులు అతడిని తనిఖీ చేశారు. నిందితుడి వెంట ఉన్న కామిక్స్ పుస్తకాలు అనుమానాస్పదంగా కనిపించాయి. ఉండవలిసిన దానికంటే అధిక బరువు ఉన్న పుస్తకాలను సిబ్బంది తినిఖీ చేయగా నిందితుడి బండారం బయటపడింది. పుస్తకం కవర్స్‌లో ఎవరికీ అనుమానం రాకుండా తెల్లటి పౌడర్‌ను దాచి తరలించేందుకు ప్రయత్నించినట్టు గుర్తించారు. అనంతరం దీన్ని పరీక్షించగా అది కొకైన్ అని తేలింది.
మొత్తం 4,006 గ్రాముల కొకైన్‌ను నిందితుడు తీసుకొచ్చాడని డీఆర్ఐ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ.40కోట్లుగా ఉండొచ్చని పేర్కొన్నాయి. ఈ క్రమంలో పోలీసులు నిందితుడిని ఎన్‌డీపీఎస్ చట్టం కింద అరెస్టు చేశారు. అనంతరం కోర్డు అతడికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
ఇటీవల కాలంలో భారతీయ ఎయిర్‌పోర్టుల్లో మాదకద్రవ్యాలు తరలిస్తూ నిందితులు దొరికిపోయిన ఉదంతాలు అనేకం వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాల ఆటకట్టించేందుకు డీఆర్ఐ బృందాలు రంగంలోకి దిగాయి. పలు ఎయిర్‌పోర్టుల్లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తూ నిందితుల గుట్టురట్టు చేస్తున్నాయి. ఇటీవల ఓ మహిళ దోహా నుంచి 6 కిలోగ్రాముల కొకెయిన్‌ను తీసుకొచ్చి ముంబై ఎయిర్‌పోర్టులో దొరికిపోయింది. బిస్కెట్ ప్యాకెట్స్‌లో దాచిన కొకైన్‌ను అధికారులు ఆమె వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
మోదీ జీ సమాధానం చెప్పండి.. ట్రంప్ కామెంట్స్‌పై రాహుల్ గాంధీ స్పందన
నిమిష ప్రియ కేసుపై స్పందించిన విదేశాంగ శాఖ.. ఇది సున్నితమైన అంశమని ప్రకటన
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి