Fuel Switch Inspection: ఇంధన స్విచ్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేయండి.. ఎయిర్‌లైన్స్‌కు డీజీసీఏ ఆదేశాలు
ABN , Publish Date - Jul 14 , 2025 | 08:08 PM
భారతీయ ఎయిర్‌లైన్స్ సంస్థలు తమ బోయింగ్ విమానాల్లోని ఇంధన స్విచ్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని డీజీసీఏ తాజాగా ఆదేశించింది. జులై 21లోపు ఈ తనిఖీలు పూర్తి చేయాలని ఎయిర్‌లైన్స్ సంస్థలను కోరింది.

ఇంటర్నెట్ డెస్క్: బోయింగ్ విమానాల్లోని ఇంధన స్విచ్‌ల లాకింగ్ సిస్టమ్స్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని డీజీసీఏ దేశీయ ఎయిర్‌లైన్స్‌ను ఆదేశించింది. జులై 21 లోపు తనిఖీలను పూర్తి చేయాలని తెలిపింది. భారత్‌లో రిజిస్టరైన బోయింగ్ జెట్స్ అన్నిటికీ ఈ తనిఖీలు తప్పనిసరి అని పేర్కొంది.
ప్రస్తుతం భారత్‌లో ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలు బోయింగ్ డ్రీమ్‌లైనర్ జెట్స్‌తో సేవలందిస్తున్నాయి. ఎయిర్ ఇండియా వద్ద 30 డ్రీమ్‌లైనర్ జెట్స్ ఉండగా ఇండిగో ఇటీవలే బోయింగ్ 787-9 విమానాలతో సేవలను ప్రారంభించింది.
ఎయిర్ ఇండియా ఇప్పటికే 50 శాతం తనిఖీలు పూర్తి చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఇంధన స్విచ్‌లల్లో ఎలాంటి లోపాలు బయటపడలేదని సమాచారం. ఇక ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్లో కూడా ఈ తనిఖీలు నిర్వహించగా ఎలాంటి లోపాలు కనిపించలేదని తెలుస్తోంది.
అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 విమానం కూలిన ఘటనపై ఇటీవల విడుదలైన ఏఏఐబీ నివేదిక కలకలం రేపిన విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో ఈ స్విచ్‌లు ఇంజెన్‌లకు ఇంధనం సప్లై చేసే రన్ పొజిషన్ నుంచి కట్ ఆఫ్ పొజిషన్‌కు వెళ్లినట్టు నివేదికలో పేర్కొన్నారు. వీటిని ఆఫ్ ఎందుకు చేశావని ఓ పైలట్ అడగడం, తానేమీ చేయలేదని మరో పైలట్ బదులిచ్చినట్టు కూడా బ్లాక్ బాక్స్‌లో రికార్డయ్యింది. టేకాఫ్ అయిన సెకెన్ల వ్యవధిలోనే రెండు ఇంజెన్‌లకు ఇంధన సరఫరా నిలిచిపోయినట్టు ప్రాథమిక నివేదికలో తేలింది.
ఈ నేపథ్యంలో ఎతిహాద్ ఎయిర్‌వేస్‌తో పాటు ఇతర ప్రధాన ఎయిర్‌లైన్స్ సంస్థలన్నీ తమ బోయింగ్ విమానాల పైలట్‌లకు ఇంధన స్విచ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. ఈ క్రమంలోనే డీజీసీఏ కూడా భారతీయ ఎయిర్‌లైన్స్ సంస్థలకు తాజా ఆదేశాలు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి:
కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రి జేపీ మంత్రి సౌదీ పర్యటన
మహారాష్ట్రలో మరో కలకలం.. హిందీలోనే మాట్లాడతానన్న ఆటో డ్రైవర్‌పై దాడి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి