Delhi Launches Cloud Seeding: కాలుష్యం కమ్ముకున్న వేళ.. ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్..
ABN , Publish Date - Oct 28 , 2025 | 08:24 PM
ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తలు ఖేక్ర, బురారి మధ్యలో 46.3 కిలోమీటర్ల పొడవు, 7.4 కిలోమీటర్ల వెడల్పులో క్లౌడ్ సీడింగ్ చేశారు. మొదటి రౌండ్‌లో భాగంగా 4 వేల అడుగుల ఎత్తులో ఆరు ప్లెయిర్స్‌ను రిలీజ్ చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం తారాస్థాయికి చేరింది. ఓ మనిషి 9 సిగరెట్లు తాగితే ఎంత ప్రభావం చూపుతుందో.. అంత దారుణంగా అక్కడి గాలి పాడైపోయింది. కాలుష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్య సమస్యలకు సైతం గురవుతున్నారు. ఢిల్లీ ప్రభుత్వం కాలుష్యాన్ని తగ్గించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే క్లౌడ్ సీడింగ్‌కు శ్రీకారం చుట్టింది. మంగళవారం మధ్యాహ్నం రెండు క్లౌడ్ సీడింగ్‌లు జరిగాయి. ఒకే ప్రాంతంలో ఈ రెండు క్లౌడ్ సీడింగ్‌లు జరిగాయి.
ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తలు ఖేక్ర, బురారి మధ్యలో 46.3 కిలోమీటర్ల పొడవు, 7.4 కిలోమీటర్ల వెడల్పులో క్లౌడ్ సీడింగ్ చేశారు. మొదటి రౌండ్‌లో భాగంగా 4 వేల అడుగుల ఎత్తులో ఆరు ప్లెయిర్స్‌ను రిలీజ్ చేశారు. రెండో రౌండ్ మధ్యాహ్నం 3.55 నిమిషాలకు జరిగింది. 5 వేల అడుగుల ఎత్తులో ఈ సారి 8 ఫ్లెయిర్స్ రిలీజ్ చేశారు. అయితే, మేఘాల్లో తేమ తక్కువగా ఉండటంతో ఈ రెండు క్లౌడ్ సీడింగ్‌ల కారణంగా వర్షం పడే అవకాశం 15 నుంచి 20 శాతం తక్కువగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.
క్లౌడ్ సీడింగ్ అవసరమా?..
దేశ రాజధాని ఢిల్లీ గాలి కాలుష్యానికి పెట్టింది పేరు. సంవత్సరం పొడవునా నగరంలో గాలి కాలుష్యం తారా స్థాయిలో ఉంటుంది. అయితే, చలికాలం వచ్చిందంటే కాలుష్యం మరింత పెరుగుతుంది. ఢిల్లీని ఆనుకుని ఉన్న రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దగ్ధం చేయటం వల్ల ఢిల్లీలో కాలుష్యం పెరుగుతోందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఢిల్లీ వాయు కాలుష్యంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది. ఢిల్లీ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కఠినమైన రూల్స్ అమలు చేస్తూ ఉంటుంది.
ఇవి కూడా చదవండి
కాకినాడకు సమీపంలో తీరాన్ని తాకిన మొంథా తుపాన్
రష్యా నుంచి చమురు దిగుమతుల నిలిపివేత.. ప్రత్యామ్నాయాలపై దృష్టి..