Delhi Blasts: ఢిల్లీ పేలుళ్లు.. నిధులు సమీకరణలో కీలకంగా మహిళా డాక్టర్
ABN , Publish Date - Nov 11 , 2025 | 07:26 PM
ఢిల్లీ పేలుళ్ల కేసుకు సంబంధించి దర్యాప్తు సంస్థలు ఇన్వెస్టిగేషన్‌ను ముమ్మరం చేశాయి. ఫరీదాబాద్ ఉగ్రకుట్ర కేసులో పట్టుబడ్డ మహిళా డాక్టర్ షాహీన్.. నిధుల సమీకరణలో కీలకంగా వ్యవహరించినట్టు సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఆమె పోలీసుల కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ పేలుళ్ల ఘటన తీరుతెన్నులతో దర్యాప్తు సంస్థలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విద్యావంతులు అతివాదంవైపు మొగ్గు చూపుతున్న వైనంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఫరీదాబాద్ ఉగ్రకుట్ర భగ్నం తరువాత ఢిల్లీ ఎర్రకోట సమీపంలో పేలుళ్లు సంభవించిన విషయం తెలిసిందే. ఇక ఫరీదాబాద్‌లో పలువురు ఉగ్రవాదుల అరెస్టు అనంతరం డా.ఉమర్ అప్రమత్తమై ఢిల్లీలో కారుతో ఆత్మాహుతి దాడికి దిగాడని పోలీసులు భావిస్తున్నారు. ఇక ఫరీదాబాద్ (యూపీ) ఉదంతంలో పట్టుబడ్డ మహిళ డాక్టర్ షాహీన్.. ఉగ్రవాదులకు నిధుల సేకరణలో కీలకంగా వ్యవహరించినట్టు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నారు.
డా.షాహీన్ సయీద్ యూపీ వాస్తవ్యురాలు. ఆత్మాహుతి దాడి చేసిన ఉగ్రవాది ఉమర్‌కు ఆమె తెలుసని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ఫరీదాబాద్ ఉగ్ర కుట్రలో కీలక నిందితుడిగా ఉన్న ముజమ్మిల్‌తో ఆమెకు సంబంధం ఉందని కూడా తెలుస్తోంది.
భారత మహిళల్లో మతోన్మాదానాన్ని రెచ్చగొట్టేందుకు పాక్ ఉగ్ర సంస్థ జైష్-ఏ- మహమ్మద్ ప్రయత్నాలతో డా.షాహీన్ అతివాదంవైపు మళ్లినట్టు తెలుస్తోంది. ఇతర మహిళలను తమ కార్యకలాపాల్లో చేర్చుకునేందుకు కూడా ప్రయత్నించినట్టు సమాచారం. తమ ఉగ్ర కార్యకలాపాల కోసం నిందితులు దాదాపు రూ.45 లక్షలు సేకరించినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ అంశంలో డా. షాహీన్ కీలకంగా వ్యవహరించింది. డాక్టర్‌గా తనకున్న నేపథ్యం, పరిచయాల మాటున ఆమె నిధుల సమీకరణకు సహకరించింది. సంక్షేమ కార్యక్రమాల మాటున ముజమ్మీల్, ఉమర్, షాహీన్ మధ్య వైద్య సీక్రెట్‌గా సమాచార మార్పిడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమాల మాటునే వారు నగదు అక్రమ రవాణా కార్యకలాపాలను కప్పిపుచ్చారు. ఇక అల్ ఫలాలా నెట్వర్క్‌తో డా.షాహీన్‌కు ఉన్న సంబంధంపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు సంస్థలు దర్యాప్తును ముమ్మరం చేశాయి.
ఇవి కూడా చదవండి..
జైష్ ఉగ్రమూకలకు మహిళా డాక్టర్ నాయకత్వం.. ఫరీదాబాద్ ఉగ్రకుట్ర కేసులో కీలక విషయాలు
ఢిల్లీ పేలుళ్ల ఘటన.. కీలక వ్యక్తి ఫొటో వెలుగులోకి..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి