Haridwar : హరిద్వార్ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల సాయం ప్రకటించిన యూపీ సీఎం యోగి
ABN , Publish Date - Jul 27 , 2025 | 10:35 PM
హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయం సమీపంలో జరిగిన తొక్కిసలాటలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.

లక్నో (ఉత్తరప్రదేశ్), జూలై 27 : ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయం సమీపంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రాణనష్టం సంభవించడం పట్ల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. 'హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయ రోడ్డులో జరిగిన విషాదకరమైన ప్రమాదంలో భక్తులు మరణించిన వార్త చాలా బాధాకరం. హృదయ విదారకం. దుఃఖంలో మునిగిపోయిన కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను.' అని ఎక్స్ పోస్ట్ లో సీఎం యోగి పేర్కొన్నారు.
కాగా, భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనలో మరణించిన వారిలో నలుగురు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారని యూపీ అధికారులు తెలిపారు. మృతుల డెడ్ బాడీలను బాధితుల స్వస్థలాలకు తిరిగి తీసుకురావడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని సీఎం యోగి అధికారులను ఆదేశించినట్లు ఆయన చెప్పారు.
ఇలా ఉండగా, హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయం సమీపంలో జరిగిన తొక్కిసలాట బాధిత కుటుంబాలకు రూ. 2 లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మానసా దేవి ఆలయ ట్రస్ట్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ (ఆదివారం) ఉదయం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించగా మరో 25 మంది గాయాలపాలైన సంగతి తెలిసిందే. గాయపడ్డవారికి సమీప ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఇక, ఈ ఘటనలో గాయపడిన ప్రతి ఒక్కరికి రూ. 50,000 చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ తొక్కిసలాట చోటుచేసుకుంది. అటు, ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా అదే మొత్తంలో ఎక్స్ గ్రేషియా పరిహారాన్ని ప్రకటించింది. ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. గాయపడిన వారికి సమీప ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తుండగా, కొందరిని రిషికేశ్ ఎయిమ్స్ కు రిఫర్ చేశారు.
ముఖ్యమంత్రి.. హరిద్వార్ జిల్లా ఆసుపత్రిని సందర్శించి, మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. అవసరమైన అన్ని ఏర్పాట్లు వెంటనే చేశామని, బాధిత కుటుంబాలకు సాధ్యమైన అన్ని సహాయాలను అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని, ఈ విషాద ఘటనలో బాధితులకు, వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.